
'కోఠి కాలేజీ' చెప్పే విషాద ప్రేమ కథ
ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడ్డ క్రిస్టియన్ అధికారి!
కొన్ని ప్రేమ కథలు కదిలిస్తాయి. మరి కొన్ని ప్రేమ కథలు మనసుకు హత్తుకుంటాయి. ఇంకొన్ని ప్రేమ కథలు కంటతడి పెట్టిస్తాయి. భారత్‌లో బ్రిటిష్ రాజ్యాన్నే కదిలించిన ఖైరున్నీసా - జేమ్స్ కిర్క్ పాట్రిక్ ల విషాధ ప్రేమ కథ ఇది.
నిజాం స్టేట్‌లో బ్రిటిష్ వారి తరఫున, హైదరాబాద్ 6వ రెసిడెంట్‌గా జేమ్స్ కిర్క్‌పాట్రిక్ 1798 నుంచి 1805 వరకు పనిచేశాడు. "రెండవ నిజాం అలీ ఖాన్ బ్రిటీష్ రెసిడెంట్ జేమ్స్‌ను తన స్వంత కొడుకులా భావించేవాడు. 'హస్మత్ జంగ్' అనే బిరుదు ఇచ్చాడు. ఆ ప్రేమతోనే 63 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూసీకి ఉత్తరాన ఓ ప్యాలెస్ నిర్మించి ఇచ్చాడు," అని డాక్టర్ డి.సత్యనారాయణ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
Dr. Dyavanapalli Satyanarayana, Historian
"కిర్క్ ప్యాట్రిక్ మద్రాసులో జన్మించాడు. అందుకే తమిళంలో అనర్గళంగా మాట్లాడేవాడు. పర్షియన్, హిందుస్తానీ భాషలలో మంచి పట్టు వుండేది. హైద్రాబాదులోని సామాజిక రాజకీయ ఉన్నత వర్గాలతో బహిరంగంగా కలిసి మెలిసి ఉండేవాడు. ఉర్దూలో కవిత్వం చెప్పేవాడు. స్త్రీలతో విలాసంగా గడిపేవాడు. నాచ్ పార్టీలను అమితంగా ఆస్వాదించేవాడు. ఆ సమయంలోనే 35 సంవత్సరాల కిర్క్ ప్యాట్రిక్, రాజకుటుంబానికి చెందిన 15 సంవత్సరాల ఖైరున్నీసాను కలుస్తాడు. అప్పట్టికే స్థానిక సంపనుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఆమె గోషా పద్ధతిలోనే వుండేది. అయినా ఖైరున్నీసా కిర్క్ ప్యాట్రిక్ తో ప్రేమలో పడింది. ఆమె తల్లి, అమ్మమ్మ కొందరు మహిళా బంధువులు నిజాం సంస్థానంలో తమ ప్రభావాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో వారి బంధాన్ని ప్రోత్సహించారని చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ ‘వైట్ మెఘల్స్’ పుస్తకంలో ఈ విషయాన్ని రాశారు," అని డాక్టర్ అరుణ తెలిపారు.
Dr Aruna Pariti, History Dept Head, Veeranari Chakali Ilamma Women's University"
వారి బంధం, ప్రేమ, అక్రమ సంబంధంతో ఖైరున్నీసా గర్భం దాలుస్తుంది. ఈ సంఘటన సమాజానికి తెలిసి ముస్లిం ప్రజల ఆగ్రహాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్లింది. బాలిక కుటుంబ సభ్యులు అతను అత్యాచారం చేసాడని కూడా అభియోగం మోపారు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లడంతో కిర్క్ ప్యాట్రిక్ ప్రవర్తనపై కలకత్తాలో ఒక పెద్ద దుమారం చెలరేగింది. చివరకు రాజకుటుంబం మరియు కిర్క్ ప్యాట్రిక్ ఒక ఒప్పందానికి రావడంతో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రెండు నెలలకు ఒక కొడుకు పుడతాడు. తర్వాత కిర్క్ ప్యాట్రిక్ , ఖైరున్నీసాను అధికారికంగా రెసిడెన్సీ భవనంలోకి తీసుకు వచ్చిన సంవత్సరానికి కూతురు పుడుతుంది. ఆ క్రమంలో సున్తీ చేసుకొని ఇస్లాం మతంలోకి మారాడు. కుమారుడికి మీర్ గులాం అలీ సాహిబ్ ఆలమ్, కుమార్తె నూరున్నీసా సాహిబ్ బేగంగా పేర్లు పెట్టాడు. మొఘలాయి దుస్తులను ధరించేవాడు. హుక్కాతో ధూమపానం చేసేవాడు. పాన్ నమిలేవాడు, ," అని డాక్టర్ అరుణ తెలిపారు.
వారి వివాహం చట్టబద్ధంగా నమోదుకాకున్నా, చెల్లుబాటు అయ్యేదిగా లేకున్నా, "కిర్క్ ప్యాట్రిక్ తన వీలునామాలో ఈ వివాహం ద్వారా కలిగిన ఇద్దరు పిల్లల్ని తన వారసులుగా ప్రకటించి, ఖైరున్నీసా పట్ల తన ప్రేమను చాటి చెప్పాడు. కిర్క్ ప్యాట్రిక్ 41 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కలకత్తాలో మరణించాడు. కిర్క్ ప్యాట్రిక్ అకాల మరణానికి ముందు, అతని ఇద్దరు పిల్లల్ని ఇంగ్లాండ్ పంపారు. ఆ రోజుల్లో బ్రిటిష్ పురుషులు, భారతీయ స్త్రీల ద్వారా కలిగిన సంతానాన్ని బ్రిటన్ పంపి వారి బంధువుల దగ్గర పెంచేవారు. కర్క్‌పాట్రిక్ పిల్లల్ని అతని తండ్రి కెస్టన్ కెంట్ లోని తన నివాసంలో పెంచాడు. ఈ ఇద్దరు పిల్లలు 1805 మార్చి 25న మార్లీ బోన్ రోడ్ లోని సెయింట్ మేరీ చర్చిలో బాప్తిస్మం పొందారు. ఆ తరువాత వారి పేర్లు మార్చారు. క్రైస్తవ పేర్లతో విలియం జార్జ్ కర్క్‌పాట్రిక్, కేథరీన్ అరోరా "కిట్టి" కర్క్‌పాట్రిక్ అని పిలువబడ్డారు. అయితే తన ఇద్దరు పిల్లల్ని ఖైరున్నీసా చూడడానికి ఎంత ప్రయత్నించినా ఆ అవకాశం దక్కలేదు," అని డాక్టర్ అరుణ తెలిపారు.
కలకత్తా కోర్టులో కిర్క్ ప్యాట్రిక్ ఆస్తుల వ్యవహారాలు చూస్తున్న అతని అసిస్టెంట్ హెన్రీ రస్సల్‍ను ఖైరున్నీసా తరచూ కలుస్తుండటం, అలా ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆ తర్వాత 1810లో హెన్రీ రస్సల్ హైద్రాబాద్‍లో బ్రిటిష్ రెసిడెంట్‍గా వస్తాడు. కాని రస్సెల్, ఖైరున్నీసాతో తన సంబంధాన్ని కొనసాగించకుండా, పోర్చుగీసు మహిళను వివాహం చేసుకున్నాడు. దాంతో ఖైరున్నీసా పరువు బజారు పాలవడం, హైద్రాబాద్ తిరిగిరావడానికి అనుమతి లేకపోవడంతో అత్యాశగల బంధువులు ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. కొంత కాలం తర్వాత ఆమె "బ్రిటీష్ ప్రభుత్వ అనుమతితో హైద్రాబాద్ వచ్చి ఒక నాడు తాను నివసించిన రెసిడెన్సీ భవనం చూడాలని హెన్రీ రస్సల్‍ను కోరింది. కానీ అతను అనుమతించలేదు. కనీసం లండన్ వెళ్ళి పిల్లల్ని చూడాలని ఆశపడి మచిలీపట్నం వెళ్ళింది. అక్కడి నుంచి లండన్ వెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి హైదరాబాద్ వచ్చి మానసికంగా కృంగిపోయి అతి చిన్న వయస్సులో22 సెప్టెంబర్ 1813లో మరణించింది. ఆమె సమాధి రెసిడెన్సీ పక్కనున్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆవరణలో వుందని చరిత్రకారులు చెబుతారు. అయితే ప్రస్తుతం ఆ ప్రదేశంలో నూతన మెడికల్ కాలేజ్ నూతన భవనాలు వచ్చాయి," అని డాక్టర్ అరుణ తెలిపారు.
కిర్క్ ప్యాట్రిక్ , ఖైరున్నీసాల ప్రేమ, శృంగారం, బంధం, అనుబంధం ఆనాటి సాంస్కృతిక, మత, రాజకీయ పరిధులు అధిగమించి చివరకు విషాదంగా ముగిసిందని, విలియం డాల్రింపుల్ తన నవల ‘‘వైట్ మెఘల్స్’’ లోనొక్కి చెప్పాడు. ఈ నవలను 2004లో పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించారు.

