ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ రాజీనామా, త్వరలో వెబ్ సైట్ ప్రారంభం
రెండు ప్రధాన తెలుగు దినపత్రికలు- సాక్షి, ఆంధ్రజ్యోతి-ఎడిటర్లు మారనున్నారు. ఈ రెండు దినపత్రికలకు ఒకే రోజు అంటే నవంబర్-1న కొత్త ఎడిటర్లు రాబోతున్నారు.
రెండు ప్రధాన తెలుగు దినపత్రికలు- సాక్షి, ఆంధ్రజ్యోతి-ఎడిటర్లు మారనున్నారు. యాదృచ్ఛికమే కావొచ్చు గాని ఈ రెండు దినపత్రికలకు ఒకే రోజు అంటే నవంబర్-1న కొత్త ఎడిటర్లు రాబోతున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సుమారు పదహారేళ్లు ఎడిటర్ గా పని చేసిన కండ్లకుంట శ్రీనివాసాచార్యులు ఎలియాస్ కె.శ్రీనివాస్ పది రోజుల కిందట చేసిన రాజీనామాను ఆ పత్రిక యజమాని రాధాకృష్ణ శనివారం ఆమోదించారు. రోజువారీ జరిగే ఎడిటోరియల్ బోర్డు సమావేశానికి కె.శ్రీనివాస్ శుక్రవారం హాజరుకాలేదు. మీటింగ్ సమయానికి ఆయన తనకు వేరే మీటింగ్ ఉందంటూ తన సహచరునికి చెప్పి బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం. అక్టోబర్ 31న ఆయన తప్పుకుంటారు. నవంబర్ 1 నుంచి కొత్త సంపాదకునిగా ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతికి వెళ్లిన నాదెండ్ల రాహుల్ కుమార్ బాధ్యతలు చేపడతారు.
1961 జూలై 24న జన్మించిన కే శ్రీనివాస్ వాస్తవానికి ఐదేళ్ల కిందటే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని యాజమాన్యం పొడిగించింది. నల్గొండ జిల్లా నుంచి ఇటీవలి కాలంలో ఎడిటర్లు అయిన ఇద్దరిలో ఒకరు కే శ్రీనివాస్ కాగా మరొకరు వర్దెల్లి మురళి. శ్రీనివాస్ జ్యోతికి, మురళి సాక్షికి ఎడిటర్లుగా పని చేశారు. ఇద్దరూ సన్నిహితులే. రెండు మూడు పత్రికల్లో కలిసే పని చేశారు. ఇద్దరూ వామపక్ష వాదులే. తెలంగాణ వాదులే. అయితే చిత్రంగా ఈ ఇద్దరూ సమైక్యాంధ్రను కోరుకున్న పత్రికా యాజమాన్యాల కిందనే పని చేశారు. మురళీని సాక్షి యాజమాన్యం సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఎడిటోరియల్ డైరెక్టర్ హోదాలో కొనసాగించనుంది.