
KTR | ‘బ్యాలెట్ విధానమే బెస్ట్’
ఈవీఎంల వల్ల ఎన్నికలపై ప్రజలు విశ్వనీయత కోల్పోయారన్న కేటీఆర్.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని విడిచిపెట్టాలని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈవీఎంల వల్ల ఎన్నికలపైనే ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. బ్యాలెట్ పేపర్ల పద్దతిలో ఎన్నికలు నిర్వహించడం మంచిదని, ప్రజల విశ్వసనీయతను తిరిగి పొందగలమని పేర్కొన్నారు. అతిత్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్‌లో కూడా బ్యాలెట్ పేపర్లలే వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగానే ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయని పార్టీని శిక్షించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకం..
‘‘ఈవీఎంల వల్ల తాము అనుకున్న నేతను ఎన్నుకోలేకపోతున్నామన్న భావన ప్రజల్లో వస్తుంది. తాము ఓటు వేసిన నేతకు ఓటు పడటం లేదని ప్రజల్లో అవిశ్వాసం పెరుగుతోంది. అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు కూడా ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. కానీ దానిని కంటిన్యూ చేయలేదు. బ్యాలెట్ పేపర్ల పద్దతినే కొనసాగిస్తున్నాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ఈవీఎంల వల్ల నష్టం అధికంగా ఉంది. ఇప్పటికయినా ఈవీఎంలను పక్కనబెట్టి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి. ఇదే విషయాన్ని మేము కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేశాం’’ అని కేటీఆర్ చెప్పారు.
ఎన్నికల సంస్కరణలు అవసరం
‘‘ఎన్నికల సమయంలో ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును గాలికి వదిలేసిన పార్టీ తెలంగాణ కాంగ్రెస్. ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచింది. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీ కట్టుబడి ఉండకపోతే ఆ పార్టీ శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈసీదే. ఎన్నికలప్పుడు ప్రజలకు నోటికొచ్చిన హామీ ఇచ్చి అధికారం వచ్చాక అమలు చేయకపోతే ఆ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా, తరువాత ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలి. ఇండియాలో ఎన్నికల సంస్కరణలు రావాలి. ప్రజలను ప్రలోభ పెడుతున్న పార్టీలు, వంచిస్తున్న అంశాలపై చర్చించి.. మా అభిప్రాయాలను కమిషన్‌కు చెప్పాం’’ అని కేటీఆర్ వివరించారు.
ఆ గుర్తులను తొలగించాలన్నాం
‘‘ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తును పోలి ఉన్న ఇతర గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. అలాంటి గుర్తులు మొత్తం 9 ఉన్నాయి. వాటివల్ల మా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. అందుకు కారణం.. అదే ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి 27 వేల ఓట్లు చీల్చడమే. ఇలా మరెన్నో సందర్భాల్లో బీఆర్ఎస్‌కు నష్టం జరిగింది. అందుకే ఆ గుర్తులను తొలగించాలని కోరాం. మేము చెప్పిన అంశాలను అధికారులను విన్నారు. సానుకూలంగా స్పందించారు. అదే విధంగా ఈవీఎంల ప్రక్రియలో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని కూడా కోరాం. అందుకూ అంగీకరించారు’’ అని కేటీఆర్ తెలిపారు.