‘కాంగ్రెస్ తన గూండాయిజం షురూ చేసింది’
x

‘కాంగ్రెస్ తన గూండాయిజం షురూ చేసింది’

గెలిచి 24 గంటలు కూడా గడవకముందే బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారన్న కేటీఆర్.


జూబ్లీ ఉపపోరులో గెలిచి 24 గంటలు కూడా గడవకముందే నియోజకవర్గంలో కాంగ్రెస్.. గూండాయిజం మొదలుపెట్టేసిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గెలవడంతో కళ్లు నెత్తికెక్కాయని, అందుకే తమ కార్యకర్త రాకేశ్‌పై దాడి చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దయం రెహమత్‌నగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన రాకేశ్‌ను కేటీఆర్ పరామర్శించారు. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్‌ గూండాయిజం చేస్తోందని విమర్శించారు. తాము కూడా అనేక ఎన్నికల్లో గెలిచామని.. కానీ ఇలా దాడులు చేయలేదన్నారు. గెలవగానే అంతా తన రాజ్యం అనుకుంటే సబబు కాదని హితవు పలికారు. ప్రజలు పిచ్చోళ్లు కాదని, అన్నీ గమిస్తుంటారు.. గమనిస్తున్నారని అన్నారు.

‘‘మా కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోంది. మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం, చాలా ఉప ఎన్నికల్లో గెలిచాము, ఎప్పుడు కాంగ్రెస్ లాగా మేము దాడులు చేయలేదు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము. మా కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. జూబ్లీ పోరులో కాంగ్రెస్.. దొంగ ఓట్లు, గూండా గిరి చేసి, డబ్బులు పంచి గెలిచిందని అన్నారు.

అహంకారం ఎవరిదో అర్థమవుతోంది రేవంత్

అనంతరం తాను అహంకారం తగ్గించుకోవాలంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. ‘‘శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ చేసిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేలిపోయింది. గతంలో మేము అనేక ఉప ఎన్నికలు గెలిచాము, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అందుకని ఆ పార్టీ గుర్తును గాడిద మీద వేసి ఊరేగించామా? కాంగ్రెస్ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారు’’ అని అన్నారు.

రేవంత్ ఏమన్నారంటే..

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందన్నారు. “అధికారం కోల్పోయినా, కేటీఆర్‌లో ఉన్న అహంకారం ఇంకా తగ్గలేదు. అసూయ, అహంభావం రాజకీయాలకు మంచిది కాదు. పదవులు శాశ్వతం కావు. ఇప్పటికైనా కేటీఆర్‌ తన తీరు మార్చుకోవాలి. ఫేక్‌ వార్తలు, ఫేక్‌ సర్వేలు నమ్ముకొని భ్రమలో ఉండకూడదు’’ అని అన్నారు రేవంత్.

Read More
Next Story