నూతన చట్టాలపై రేవంత్ స్టాండ్ ఏంటి?
దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉన్నది. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయి. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ స్టాండ్ ఏంటో తెలపాలని కేటీఆర్ కోరారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారు. నూతన చట్టాల పైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడి చేయాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డ పైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా? లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
నూతన చట్టాలపై ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. వాటిలో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలి. దీనితోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని కోరుతున్నాం.. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలి అని లేఖలో కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్రం తెచ్చిన మూడు కొత్త చట్టాలు:
కేంద్ర తెచ్చిన మూడు కొత్త చట్టాలకు గతేడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం లభించగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న ఆమోదం తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మూడు ఒకే విధమైన నోటిఫికేషన్ల ప్రకారం, కొత్త చట్టాల నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం నేర న్యాయ చట్టాలను తీసుకొస్తున్నట్టు తెలిపింది.
ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్ లో భారతీయ సాక్ష్య అధినయమ్ 2023 చట్టాలు నేటి అర్ధరాత్రి (2024 జులై 1) నుంచి అమలులోకి వచ్చాయి. జీరో ఎఫ్ఆర్, ఆన్ లైన్ లో పోలీసు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటి అంశాలు ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
నూతన చట్టాలపై ఆందోళనలు:
కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన న్యాయ చట్టాల పైన అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాల ప్రజామేధావులు అభిప్రాయపడుతున్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు.. ఉద్యమాలు చేసే ప్రజలకు ప్రతికూలంగా కొత్త చట్టాలు వున్నాయని.. పోలీసులకు ప్రభుత్వానికి మితి మీరిన అధికారాన్ని కట్టబెడుతున్నాయని సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభ నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి, ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్ ఈ చట్టాల అమలు నిలిపి వేయాలని సుప్రీం కోర్టులో కేసు వేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నూతన చట్టాల అమలుపై తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి నూతన చట్టాలపై తమ స్టాండ్ ఏంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.