
‘ఉపఎన్నికకు రెడీ అవ్వండి’
ప్రజల దృష్టి మళ్లించడమే కేటీఆర్ టార్గెట్టా..
తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతల విషయంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించిన క్రమంలోనే కేటీఆర్ స్పందించారు. కాగా ఉపఎన్నిక విషయంలో కేటీఆర్ ఇచ్చిన పిలుపు కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేన్న చర్చ మొదలైంది. ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను అందించిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేటీఆర్.. ఉపఎన్నిక వ్యాఖ్య చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
సత్యమే గెలుస్తుంది: కేటీఆర్
‘‘ఎందులో అయినా ఎప్పటికయినా సత్యమే గెలుస్తుందన్న అంశాన్ని ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి నిరూపించింది. ‘సత్యమేవ జయతే’ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్‌కు ధన్యవాదాలు. రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పే పాంచ్ న్యాయ సూత్ర(ఐదు న్యాయ సూత్రాలు)కు కట్టుబడి ఉండాలి. పదిమంది ఎమ్మెల్యేలు చట్టవిరుద్ధంగా పార్టీ మారారని చెప్పడానికి ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు. కష్ట సమయాల్లో మతో కలిసి వచ్చిన బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కు ధన్యవాదాలు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికకు 3 నెలలే సమయం ఉంది. పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజల దృష్టి మళ్లించడమే టార్గెట్టా..
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై విచారణ జరపడానికి ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ గడువు జూలై 31 గురువారంతో ముగియనుంది. ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఇదే సమయంలో కేటీఆర్.. ఉపఎన్నికకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం అనేక చర్చలకు దారితీస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేటీఆర్ ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొందో? అన్న టెన్షన్ బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగానే ఉందని, అందుకే కేసీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఆగమేఘాలపై పలువురు నేతలతో సమావేశమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఇదే క్రమంలో ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఉపఎన్నిక, ఫిరాయింపు నేతల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు విశ్లేషకులు.
కేటీఆర్‌కు టైం కలిసొచ్చిందా..!
అదే విధంగా ఈ విషయంలో కేటీఆర్‌కు సమయం చాలా బాగా కలిసి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ఇచ్చిన రోజునే ఫిరాయింపుల విషయంలో స్పీకర్ కీలక ఆదేశాలిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రెండు కలిసి రావడంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక, అందులోని అంశాలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేటీఆర్‌కు ఫిరాయింపుల అంశం దొరికింది. ‘కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు’ అన్న చందంగా.. కాళేశ్వరం కమిషన్ నివేదిక నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి సుప్రీంకోర్టు తీర్పు రూపంలో కేటీఆర్ మంచి అవకాశం లభించింది. కాకపోతే ఈ విషయంలో కేటీఆర్ సక్సెస్ అవుతారా? లేదా? అనేది చూడాలి.