KTR | ‘రేవంత్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’
x

KTR | ‘రేవంత్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికకు రావాలన్నారు. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్ నేతలు ఎవరూ ప్రచారం చేయరని, రేవంత్ తనకు నచ్చినంత ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. ఎంత చేసుకున్నా ఉపఎన్నికలో గెలవరని, గెలిస్తే మాత్రం తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు కేటీఆర్. కొడంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు నిరసన దీక్ష సందర్భంగా కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందని, కొండగల్‌లో కురుక్షేత్రంలా యుద్ధం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదన్నారు.

‘‘కొడంగల్ ప్రజలకు వెళ్ళవేళాల అండగా ఉంటున్న వ్యక్తీ పట్నం నరేందర్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఒక దుర్యోధనుడు ( రేవంత్ రెడ్డి ) పరిపాలిస్తున్నాడు. కొడంగల్ లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. రేవంత్ రెడ్డి 14 నెలల పరిపాలన ఎనుముల అన్నదమ్ములు , అల్లుడు, అదానీ కోసం పని చేస్తున్నాడు. లగచర్ల పచ్చని పంట భూములని తొండలు గుడ్లు పెట్టని భూములని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. టకిటకిమని రైతు భరోసా పడలేదు. టక్కు టక్కుమని తులం బంగారం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మా కంపెనీ కోసం లగచర్ల భూములు గుంజుకునేందుకు సిద్దం అయ్యాడు. అడ్డుకున్నందుకు 40 మంది రైతులను జైల్లో పెట్టిండు. కొడంగల్ రైతుల కోసం ఏడాది అంతా జైల్లోనే ఉండేందుకు సిద్దమైన వ్యక్తీ పట్నం నరేందర్ రెడ్డి’’ అని అన్నారు కేటీఆర్.

‘‘రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయట్లేదు. అనుముల అన్నదమ్ములు, అదానీల కోసమే ఆయన పనిచేస్తున్నారు. రూ.కోట్లు దోచిపెట్టడానికి పనిచేస్తున్నారు. మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారు. కానీ రేవంత్ ప్రజల కోసం పనిచేయకపోగా.. ఇక్కడి ప్రజల భూములనే గుంజుకునే ప్లాన్ చేస్తున్నారు. రైతు బంధు డబ్బులు ఎవరికైనా ఇచ్చారా? రైతు రుణమాఫీ పూర్తి చేశారా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కేటీఆర్ గతంలో కూడా ఒకసారి సవాల్ చేశారు. 21 డిసెంబర్ 2024న జరిగిన అసెంబ్లీ వేదికగా రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

రాజకీయ సన్యాసం తీసుకుంటా..

అసెంబ్లీలో రైతుభరోసా అంశంపై జరిగిన చర్చ సందర్బంగా కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ అన్నీ అబద్ధాలే చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ముందు రుణాలు తెచ్చుకోండి అని రైతులకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న తన తొలి సంతకం రుణమాఫీపైనే చేస్తానని భరోసా ఇచ్చారు. ఒకటే పెన్ స్ట్రోక్‌తో రైతుల అందరి రుణాలు మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం రూ.49.5 కోట్లు అని చెప్పారు. ఏక్కడో సభలో మాట్లాడుతూ.. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40వేల కోట్లు కట్టేస్తామని చెప్పారు. అది కాస్తా కేబినెట్ సమావేశం సమయానికి రూ.31వేల కోట్లకు దిగింది. బడ్జెట్‌కు వచ్చేసరికి రూ.26వేల కోట్లు అయింది. మొన్న పాలమూరులో కాంగ్రెస్ నిర్వహించిన విజయోత్సవ సభలో రూ.19వేల కోట్లు చేశారు ఈ సీఎం. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం.. ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిస్థాయిలో జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ప్రభుత్వానికి ఈ స్థాయి బుకాయింపు మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. మళ్ళీ ఇప్పుడు అదేతరహా ఛాలెంజ్ చేశారు. మరి కేటీఆర్ సవాళ్లపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More
Next Story