రేవంత్ దమ్ము ఇంకా అర్ధంకాలేదా ?
x
Revanth Reddy

రేవంత్ దమ్ము ఇంకా అర్ధంకాలేదా ?

రేవంత్ రెడ్డి దమ్మేంటో పోయిన ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోను ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోను జనాలందరు చూసిందే


రేవంత్ రెడ్డి దమ్మేంటో పోయిన ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోను ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోను జనాలందరు చూసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో రేవంత్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంలో కూడా రేవంత్ కీలకపాత్ర పోషించారు. రేవంత్ చేరకముందు కాంగ్రెస్ పార్టీ ఈసురోమంటోంది. అలాంటిది కాంగ్రెస్ లో రేవంత్ చేరగానే జవసత్వాలు పుంజుకుంది. రెండు ఎన్నికల్లో పార్టీకి మెజారిటి సీట్లు సాధించిన రేవంత్ కొత్తగా దమ్ము నిరూపించుకోవాల్సిన అవసరముందా ?

ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ మాట్లాడుతు రేవంత్ దమ్మేంటో నిరూపించుకోమని చాలెంజ్ విసిరారు. ఎలాగంటే బీఆర్ఎస్ లో నుండి చేర్చుకున్న ఆరుగురు ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకుని దమ్ము నిరూపించుకోవాలట. 2014 తర్వాత ఫిరాయింపులకు తలుపులు బార్లా తెరిచిందే కీసీయార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీలకు చెందిన ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు సుమారు 47 మందిని తనపార్టీలోకి లాగేసుకున్నారు. అప్పట్లో ఏ ఒక్కరితో కూడా కేసీయార్ రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించుకోలేదు. కేటీయార్ చాలెంజ్ చేసినట్లుగా చేయలేదుకాబట్టి కేసీయార్ కు కూడా దమ్ములేదని అంగీకరించినట్లేనా ? రాజకీయంగా నేతలు ఒకళ్ళపై మరొకళ్ళు అనేక సవాళ్ళు చేసుకుంటారు. వాటన్నింటినీ సీరియస్ గా తీసుకుంటే ఎవరూ రాజకీయం చేయలేరు.

తెలంగాణా ఉద్యమసమయంలో ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతారని కేసీయార్ చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించారు. మరి తెలంగాణా ఏర్పడిన తర్వాత దళిత నేత కాకుండా ముఖ్యమంత్రిగా కేసీయార్ ఎందుకు ప్రమాణస్వీకారం చేశారు. పైగా దళితులు ముఖ్యమంత్రి పదవిని సమర్ధవంతంగా నిర్వహించలేరని ఒక పిచ్చి ప్రకటనచేశారు. మాటిచ్చి తప్పిన కేసీయార్ పై దళితులు కాని తెలంగాణా సమాజం కాని ఎదురుతిరగలేదు. ఎందుకంటే రాజకీయంగా తమ అవసరాల కోసం అనేకమంది అనేకరకాలుగా మాట్లాడుతుంటారని జనాలకు తెలుసు. కాబట్టే కేసీయార్ ప్రకటనను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కేసీయార్ ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల నుండి ప్రజాప్రతినిదులను లాక్కున్నపుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎంత గోలచేసినా కేసీయార్ పట్టించుకోలేదు. మరపుడు ఫిరాయింపులతో రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవాలని కేసీయార్ కు కేటీయార్ సలహా ఇచ్చారా ?

కాబట్టి కేటీయార్ ఎన్ని ఛాలెంజులు చేసినా ఎవరూ పట్టించుకోరు. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయేవారు లేరు. ఎందుకంటే రాజకీయాలు చేయటంలో ఒకళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు అని అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు, ఎన్నో చాలెంజులు చేస్తుంటారు. వాటన్నింటినీ అధికారపార్టీ పట్టించుకోదని కేసీయార్ పదేళ్ళ పాలనలో జనాలకు బాగా అర్ధమైంది. అందుకనే ఇపుడు కేటీయార్ ఛాలెంజులను కూడా జనాలెవరూ పట్టించుకోవటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు కాంగ్రెస్ లో చేరద్దని పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలతో కేసీయార్ భేటీలు జరిపి, భోజనాలు పెట్టి మరీ బుజ్జగిస్తున్నారు. మరోవైపు పార్టీని వదిలేసే వాళ్ళు వదిలేస్తునే ఉన్నారు. కేసీయార్ రివ్యూ మీటింగులు పెడుతున్నపుడు చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరు ఎంఎల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేసీయార్ భరోసా ఇస్తున్నా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు నమ్మకుండా పార్టీని వదిలేస్తున్నారన్న ఉక్రోషమే కేటీయార్ చాలెంజుల్లో కనబడుతోంది. ఇంకా ఎంతమంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు బీఆర్ఎస్ ను వదిలేస్తారో అన్న టెన్షన్ కేటీయార్లో పెరిగిపోతున్నట్లుంది. అదే జరిగితే కేసీయార్కు ప్రధాన ప్రతిపక్ష హోదా జారిపోతుంది. అలాగే అసెంబ్లీ, శాసనమండలిలో పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అనే హోదా కూడా పోతుంది. అదే జరిగితే బీఆర్ఎస్ చాలా బలహీనపడిపోవటం ఖాయం. అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల విషయంలో కేసీయార్ ఎలా వ్యవహరించారో, ఏదైతే చేశారో ఇపుడు రేవంత్ కూడా అచ్చంగా బీఆర్ఎస్, కేసీయార్ విషయంలో అదే దారిలో వెళుతున్నారు. దాన్నే కేటీయార్ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే అర్ధంలేని ఛాలెంజులు చేస్తున్నారు.

Read More
Next Story