KTR | ‘రాజీనామాలకు సిద్ధం’
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇందులో భాగంగానే రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరాల అంశాల్లో తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాల విషయంలో ఆ నేతలకే ఒక సమన్వయం లేదని, ఒకరు జరిగిందంటే.. మరొకరు జరగలేదని చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కావాలంటే సభను వాయిదా వేసి వెళ్లయినా పరిశీలిద్దామని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వందకు వందశాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పాలనలో 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు నిరూపిస్తే తమ శాసనసభాపక్ష నేతలంతా రాజీనామాలు చేస్తారని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఆయన చేసిన ఈ సవాళ్లు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.
రాజకీయ సన్యాసం తీసుకుంటా..
అసెంబ్లీలో రైతుభరోసా అంశంపై జరిగిన చర్చ సందర్బంగా కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ అన్నీ అబద్ధాలే చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ముందు రుణాలు తెచ్చుకోండి అని రైతులకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న తన తొలి సంతకం రుణమాఫీపైనే చేస్తానని భరోసా ఇచ్చారు. ఒకటే పెన్ స్ట్రోక్‌తో రైతుల అందరి రుణాలు మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం రూ.49.5 కోట్లు అని చెప్పారు. ఏక్కడో సభలో మాట్లాడుతూ.. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40వేల కోట్లు కట్టేస్తామని చెప్పారు. అది కాస్తా కేబినెట్ సమావేశం సమయానికి రూ.31వేల కోట్లకు దిగింది. బడ్జెట్‌కు వచ్చేసరికి రూ.26వేల కోట్లు అయింది. మొన్న పాలమూరులో కాంగ్రెస్ నిర్వహించిన విజయోత్సవ సభలో రూ.19వేల కోట్లు చేశారు ఈ సీఎం. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం.. ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిస్థాయిలో జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ప్రభుత్వానికి ఈ స్థాయి బుకాయింపు మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలంతా రాజీనామా చేస్తాం: కేటీఆర్
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కూడా వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూడా కేటీఆర్ మరోసారి రాజీనామాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ఒక్క విషయం నిరూపిస్తే.. కాంగ్రెస్ ప్రతిపక్షం లేని ప్రభుత్వం మారే అవకాశం కల్పిస్తామన్నంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను మరో పది రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఇంకా విద్యుత్ సరఫరా, ఇరిగేషన్ , మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలని అన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై కూడా ఒక రోజు చర్చించాలని కోరారు. ‘‘గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉంది. గతంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లకు మాత్రం డబ్బా కొట్టడం సబబా? బీఆర్ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని ప్రభుత్వం బుకాయిస్తోంది. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో సగటున 19.2 గంటలు విద్యుత్ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పడు కాంగ్రెస్ పాలనలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఒక రోజు వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లాదం. అక్కడి పరిస్థితులు పరిశీలిద్దాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుంది. రైతు బంధుపై విపరీతమైన దుష్ప్రచారం చేశారు. తెలంగాణ రైతు బతుకును మార్చిన పథకం అది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.