ముదురుతున్న కేటీఆర్-కలెక్టర్ వివాదం
x
Collector Sandeep kumar Jha and KTR

ముదురుతున్న కేటీఆర్-కలెక్టర్ వివాదం

ఆమధ్య ఏదో అంశంపై మండిపోయిన కేటీఆర్ కలెక్టర్ ను పట్టుకుని సన్నాసి అంటు దూషించారు


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్, కవిత లాంటి అగ్రనేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే కిందిస్ధాయి నేతలు ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ లోని కేటీఆర్(KTR) మద్దతుదారుల్లో కొందరు నేరుగా చీఫ్ సెక్రటరీని కలిసి కలెక్టర్ పై ఫిర్యాదు చేయటమే. భూకబ్జాలు, అనుమతుల్లేని వ్యాపార సముదాయాలు, అక్రమనిర్మాణాలు తదితరాలపై కలెక్టర్ ఉక్కుపాదం మోపుతున్నారు. దాంతో జిల్లాలోని కొందరు కలెక్టర్ అనవసరంగా తమను టార్గెట్ చేస్తున్నారంటు గోలమొదలుపెట్టారు. ఎందుకంటే తామంతా కేటీఆర్ మద్దతుదారులం కావటమే కలెక్టర్ కోపానికి కారణమంటు గోలగోల చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఫిర్యాదులో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.

ఇంతకీ కేటీఆర్ మద్దతుదారులు చూపించిన ఉదాహరణలు ఏవంటే కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడన్న కారణంగా కలెక్టర్ ఒక టీస్టాల్ ను తీసేయించాడన్నారు. కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సీజ్ చేయించినట్లు కేటీఆర్ మద్దతుదారులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనచేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. పాడిరైతుల్లో కేటీఆర్ మద్దతుదారులున్నారన్న కారణంతోనే సీజ్ చేయించినట్లు ఆరోపించారు. తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన అనీల్ రెడ్డి కలెక్టర్ మీద సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడు. దాంతో కలెక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టుకు ప్రయత్నించారు.

అయితే అనీల్ తప్పించుకున్నాడన్న కోపంతో అతని చిన్నాన్న రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. రాజిరెడ్డి 30 గుంటల భూమిని కబ్జా చేసినట్లు పోలీసులు తప్పుడు కేసు బుక్ చేశారని కేటీఆర్ మద్దతుదారులు మండిపోయారు. రాజిరెడ్డి మూగవాడన్న కనికరం కూడా లేకుండా అదుపులోకి తీసుకుని స్టేషన్లో ఉంచినట్లు చెప్పారు. చివరగా 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలకు తూట్లుపొడిచినట్లు చెప్పారు. కౌన్సిలింగ్ జరపకుండానే కలెక్టర్ అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినట్లు మద్దతుదారులు తమ ఫిర్యాదులో చెప్పారు.

అయితే తనపైన కలెక్టర్ కు కేటీఆర్ మద్దతుదారులు చేసిన ఫిర్యాదును కలెక్టర్ తిప్పికొట్టారు. ఇంతకీ కలెక్టర్ ఏమన్నారంటే సిరిసిల్లలో పబ్లిక్ ప్లేసును టీస్టాల్ యజమాని ఆక్రమించుకున్నట్లు చెప్పారు. పైగా ఎలాంటి ట్రేడ్ లైసెన్సు లేకుండానే టీస్టాల్ నడుపుతున్నాడు కాబట్టే కొట్టును ఎత్తేయించినట్లు చెప్పారు. కరీంనగర్ డైరీకి అనుబంధంగా నడుస్తున్న అగ్రహారం డెయిరీ ఎలాంటి లైసెన్సు లేకుండా ఇంతకాలం నడుస్తున్నట్లు బయటపడిందన్నారు. అగ్రహరం డెయిరీకి సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ కన్వర్షన్, బిల్డింగ్ పర్మీషన్, పర్యావరణ అనుమతులు లేకుండానే ఇంతకాలం నడిచిన విషయం బయటపడింది కాబట్టే తాళాలు వేయించినట్లు చెప్పారు.

తంగళపల్లి మండలం జిల్లెల గ్రామం సర్వేనెంబర్ 1,183లోని స్ధలాన్ని ప్రభుత్వం రాజిరెడ్డికి అసైన్ చేయలేదన్నారు. 2018లో ప్రభుత్వ రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ భూమిని తనపేరుమీద మార్చుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. రికార్డులను ట్యాంపర్ చేసినందుక రాజిరెడ్డిపై మీద కేసునమోదైనట్లు వివరించారు. ఇక 2008 డీఎస్సీ అభ్యర్ధులకు అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇవ్వటంపై స్పందించిన కలెక్టర్ డీఈవో జగన్మోహన్ రెడ్డికి విధులపై అంకితభావం లేదన్నారు. తనకు తెలీకుండానే డీఈవో అభ్యర్ధులకు ఆర్డర్స్ ఇచ్చినట్లు మండిపడ్డారు. తాను డీఈవోను నిలదీస్తే పైనుండి తనకు ఆదేశాలున్న కారణంగానే అభ్యర్ధులకు అపాయిట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాధానమిచ్చినట్లు చెప్పారు. జిల్లా సర్వశిక్షా అభియాన్ ఛైర్మన్ గా తానుండగా డీఈవోకి పై నుండి ఆదేశాలు ఎవరిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. తాను ఎవరినీ రాజకీయంగా ఎవరినీ టార్గెట్ చేయటంలేదని వివరించారు. తనకు ఎవరిమీద రాజకీయ కక్షలు లేదని, తనకు వ్యక్తిగత అజెండా కూడా ఏమీలేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివరించారు.

కేటీఆరే కారణమా ?

అసలు ఈ సమస్య మొత్తానికి కారణం ఏవరంటే కేటీఆర్ అనే చెప్పాలి. ఆమధ్య ఏదో అంశంపై మండిపోయిన కేటీఆర్ కలెక్టర్ ను పట్టుకుని సన్నాసి అంటు దూషించారు. తనను కేటీఆర్ సన్నాసి అనటంతో కలెక్టర్ బాగా నొచ్చుకున్నారు. అప్పటినుండి కేటీఆర్-కలెక్టర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. రేవంత్ మీదో లేకపోతే మంత్రులపైన నోరుపారేసుకున్నట్లు ఉన్నతాధికారులపైన కూడా నోరుపారేసుకున్నా ఏమీకాదన్నది కేటీఆర్ ఆలోచన. అందుకనే కలెక్టర్ ను కేటీఆర్ చాలా చులకనగా మాట్లాడారు. ఇపుడు అధికారుల్లో చాలామంది ఎలాగ తయారయ్యారంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పింది చేయటానికి అలవాటుపడిపోయారు. ఇందుకు బీఆర్ఎస్ అనిలేదు రేవంత్ రెడ్డి(Revanth)నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) పాలన అనిలేదు. పదేళ్ళ అధికారంలో అధికారయంత్రాంగాన్ని కేసీఆర్(KCR), కేటీఆర్ కూడా ఇలాగే వాడుకున్నారు. ఆ విషయాన్ని మరచిపోయి ప్రతిపక్షంలోకి రాగానే అధికారులపై కేటీఆర్ మండిపడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని మరచిపోయారంతే.

Read More
Next Story