జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారు: కేటీఆర్
x

జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారు: కేటీఆర్

నలుగు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడించి మా ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తున్న ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి సస్పెండ్‌ను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ నేతలంతా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని, పక్కా ప్లాన్ ప్రకారమే ఆయనను సస్పెండ్ చేశారని కేటీఆర్ విమర్శించారు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏం తప్పుందో చెప్పాలని కోరారు. జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు.

‘‘స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి ఏకోణంలోనూ అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటలు కూడా అన్నట్లుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు ఆయనను సస్పెండ్ చేయడం దారుణం. తాను చేసిన తప్పేంటో అడిగే అవకాశం కూడా జగదీష్ రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలి. సభ సజావుగా జరగడానికి సహకరించాలి. ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టం చెప్పాం. అయినా నియంతృత్వ పోకడలతో సభను 5గంటల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడించి మా ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తున్న ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు’’ అని కేటీఆర్ అన్నారు.

Read More
Next Story