
KTR | ‘ఆర్ఎస్ అరెస్ట్ పూర్తిగా అక్రమమే’
రైతులకు మద్దతుగా నిలిచినందుకు భయపడే అరెస్ట్‌లు చేస్తున్నారన్న కేటీఆర్.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమేనన్నారు. పోడు రైతులకు మద్దతుగా తమ పార్టీ నిలవడంతో కాంగ్రెస్ వెన్నులో వణుకుపుట్టిందని, అందుకే అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులను పంపి అరెస్ట్‌లు చేయిస్తోందని కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. రైతులకు అండగా ఉండే తమ పార్టీ నేతలకు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తన్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-దిందా రైతులు కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు నేతలతో కలిసి కాగజ్‌నగర్‌లో శాంతియుతంగా ధర్నా చేశారు.
త్వరలోనే ప్రభుత్వ పతనం: కేటీఆర్
ఆర్ఎస్ ప్రవీణ్ చేస్తున్న ధర్నాకు సంబంధిచి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్ట్‌ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కుట్రపూరిత అరెస్ట్‌లకు ఇకనైనా కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు.
‘‘రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనం. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో సహా బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
దమ్ముంటే ఆకలి చావులు ఆపండి సీఎం: ఆర్ఎస్
‘‘సిర్పూర్-దిందా గ్రామ పోడు రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టినందుకు నిరసనగా ఈ రోజు శాంతియుతంగా కాగజ్ నగర్లో ధర్నా చేస్తుంటే మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ధమ్ముంటే దిందా గ్రామంలో అటవీ అధికారుల క్యాంపు ఎత్తేసి ఆకలి చావులు ఆపండి రేవంత్, మా నిరసనలు కాదు. తెలంగాణ ప్రజలారా, దిందా రైతులు ఆకలి చావుల అంచుల్లో ఉన్నారు. మనమంతా ఒక్కటై వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు.
రైతులకు మద్దతు తెలపడం తప్పా..: హరీష్
ఆర్ఎస్ ప్రవీణ్ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఘాటుగా స్పందించారు. పోడు రైతులకు మద్దతుగా నిలవడం తప్పా? అని ప్రశ్నించారు. ‘‘కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బిఆర్ఎస్ నాయకులు చేసిన తప్పా? రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? కౌటాలా పోలీసు స్టేషన్ లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా బిఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.