‘రైతులేమైనా ఉగ్రవాదులా’.. లగచర్ల ఘటనపై కేటీఆర్
x

‘రైతులేమైనా ఉగ్రవాదులా’.. లగచర్ల ఘటనపై కేటీఆర్

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై రైతులు, స్థానికులు దాడి చేశారు.


వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై రైతులు, స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనకు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రైతులకు మద్దతును ప్రకటించారు. లగచర్ల రైతులను అరెస్ట్ చేయడం ద్వారా వారు చేపట్టిన పోరు ఆగిపోదన్నారు. లగచర్ల రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. రైతులను అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్ట్‌లు దారుణమని అన్నారు.

రైతులు తీవ్రవాదులా..

‘‘అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!

బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!

అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?

రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?

ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?

ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !

అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు?

ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి..

పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా?

మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం..

భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా?

రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం..పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా’’ అని తెలిపారు కేటీఆర్.

లగచర్లలో అసలేం జరిగిందంటే..

ఫార్మా విలేజ్‌కు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకోవానికి లగచర్ల వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం మొదలైంది. కలెక్టర్‌కు స్థానికుల నిరసన సెగ గట్టిగా తగిలింది. ఆయనపై గ్రామస్తులు, రైతులు దాడులు చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై లగచర్ల పోలెపల్లి, దుద్యాల, లగచర్ల తండాలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కెలక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్, ఇతర అధికారులు వెళ్లారు. వారిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఒక మహిళ.. కలెక్టర్‌పై చేయి చేసుకుందని కూడా సమాచారం.

కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులంతా కూడా అక్కడి వెనుదిరిగారు. దీంతో లగచర్లలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అయితే కలెక్టర్, అధికారులు గ్రామానికి రాగానే వారికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఆయన పైకి దూసుకెల్లారు. కలెక్టర్ మాట్లాడే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. పరిస్థితులు చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కలెక్టర్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అయినా ఆగని రైతులు, ప్రజలు కర్రలు పట్టుకుని అధికారుల వాహనాల వెంటపడి మరి దాడి చేశారు. అయితే కలెక్టర్, అధికారులు సరైన బందోబస్తు లేకుండా వెళ్లడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందని కొందరు అంటున్నారు. పోలీసుల భద్రత పెద్దగ లేదని గమనించడంతోనే ఆందోళనకారులు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారని అంటున్నారు.

Read More
Next Story