కేటీఆర్ డెడ్ లైన్
x

కేటీఆర్ డెడ్ లైన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో 50 వేల మంది రైతులతో వచ్చి మేమే పంపులు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లో భాగంగా శుక్రవారం కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కన్నెపల్లి పంప్ హౌస్‌ ను సందర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులం మొత్తం ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించామని కేటీఆర్ తెలిపారు. కాలంతో పాటు పోటీ పడి ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారని అన్నారు. ఉన్న ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణను భౌగోళికంగా చూస్తే మనకు నీళ్లు కావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే ప్రాణహిత, మానేరు, గోదావరి కలిసే ఈ ప్రాంతంలో నీళ్లు తీసుకోవచ్చవని కేేసీఆర్ మేడిగడ్డ పాయింట్‌ను ఎంచుకున్నారన్నారు.


ఎత్తిపోతలే శరణ్యం...

ఎల్ఎండీలో, మిడ్ మానేరులో 5 టీఎంసీల నీళ్లు కూడా లేవు. శ్రీరాంసాగర్‌లో 90 టీఎంసీలకు గాను 25 టీఎంసీలే ఉన్నాయి. పై నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి మనకు కనబడటం లేదు. ఇప్పుడు మేడిగడ్డ వద్ద దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. బటన్ ఆన్ చేస్తే చాలు సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, భువనగరి, ఆలేరు వరకు మనం సస్యశ్యామలం చేయవచ్చు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయకమ్మ సాగర్, అన్నపూర్ణ జలాశయానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే శరణ్యం. నీళ్లను ఎత్తిపోసి కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నింటినీ నింపితే హైదరాబాద్‌కు కూడా పుష్కలంగా నీళ్లు ఇవ్వవచ్చు. మేడిగడ్డ నుంచి అటు హైదరాబాద్ వరకు ఇటు ఆలేరు వరకు తాగు, సాగు నీళ్ల బాధ లేకుండా చేయవచ్చు అన్నారు కేటీఆర్.

"క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కరీంనగర్‌లో మూడురోజులకొకసారి నీళ్లు ఇస్తున్నారు. రైతులు కరవు పరిస్థితులున్నాయని ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నిండు కుండలా ప్రాజెక్ట్‌లు కళకళలాడాయి. ఇప్పుడు నీళ్లకు కరవు ఏర్పడిందని చెబుతున్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లో వంద కంపోనెంట్లలో ఒక్కటైన మేడిగడ్డ వద్ద చిన్న సమస్యను భూతద్దంలో చూపెట్టారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేశాయి. మొత్తంగా కేసీఆర్ పై కక్షగట్టి ఆయనను గద్దె దించారు. మీ లక్ష్యం నెరవేరింది కదా. ఇంకా కేసీఆర్ మీద పడి ఏడ్వటం ఎందుకు ఆయనను బద్నా చేసే కుట్రలు ఎందుకు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రాజకీయాలు చేద్దాం. ఆ తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజలకు మీకు మంచి అవకాశం ఇచ్చారు. అధికారాన్ని ప్రజలకు మంచి చేసేందుకు వినియోగించండి" అని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు.


ప్రభుత్వానికి డెడ్ లైన్...

గత డిసెంబర్-జనవరిలో కూడా రాజకీయాలు వద్దు రైతులకు నీళ్లు ఇవ్వండంటూ కోరాం. కానీ కేసీఆర్ మీద కోపంతో రైతులకు అన్యాయం చేసి పంటలను ఎండబెట్టారు. ఇవ్వాళ కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి చూస్తుంటే మనసు ఉప్పొంగింది. కానీ ఎల్ఎండీ, మిడ్ మానేరు, శ్రీరాం సాగర్ ఎండిపోతుంటే మనసుకు బాధ అవుతోంది. కావాల్సిన నీళ్లు ఉన్నాయి. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు, అంటే ఆగస్ట్ 2 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ఈలోపు అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతుల పంటలను ఎందుకు ఎండబెడుతున్నారో చెప్పాలంటూ చర్చను కూడా కోరతాం. ఆగస్ట్ 2 లోపు ప్రభుత్వం గానీ పంపింగ్ స్టార్ట్ చేయకపోతే.. కేసీఆర్ ఆధ్వర్యంలో 50 వేల మంది రైతులతో మేమే కన్నెపల్లి పంప్ హౌస్‌ ను స్టార్ట్ చేస్తాం" అని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More
Next Story