తెలంగాణ  చిచ్చుకు కారణం RR లే...
x

తెలంగాణ చిచ్చుకు కారణం RR లే...

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శనివారం జేఎన్టీయూలో నిర్వహించిన ఓ సదస్సులో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. గ్రూప్ వన్ మెయిన్స్ రేషియోను 1:100 చేయాలని, గ్రూప్ 2 తోపాటు డీఎస్సీ కూడా వాయిదా వేయాలని నిరుద్యోగులు దాదాపు 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలపై సీఎం స్పందిస్తూ... ముగ్గురు దీక్షలకు కూర్చున్నారు కానీ వారిలో ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసినవాళ్లు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం, తమ కోచింగ్ సెంటర్ కి లాభాల కోసం దీక్ష చేస్తున్నవారే అని సీఎం అన్నారు.

సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు నిరుద్యోగుల ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్టయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా శనివారం రాత్రి అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తోపాటు పలుచోట్ల అభ్యర్థులు రోడ్డెక్కారు. సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లుపైనే బైఠాయించారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ గంటలతరబడి నిలిచిపోయింది. భారీగా పోలీసులు మోహరించి అభ్యర్థులను చెదరగొట్టారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై చేసిన రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారన్నారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని అవమానించేలా మాట్లాడారన్నారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈగోకి పోకుండా నిర్ణయాలు తీసుకోవాలి...

మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి. మిమ్మల్ని వదిలిపెట్టము... క్షేత్రంలో నిలదీస్తాం విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతాం. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకి, బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలి. కండకావరంతో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఆపాలి. రేవంత్ నిరుద్యోగులు విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ అన్నారు.

నిరుద్యోగాన్ని తీర్చుకోడానికి ఆ ఇద్దరు రెచ్చగొట్టారు..

రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మాటికి రేవంత్, రాహుల్ గాంధీ (RR) లే అని కేటీఆర్ అన్నారు. "గతంలో ఏ పరీక్ష రాస్తుండని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేసిండో చెప్పాలి. అశోక్ నగర్ లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్... మీరు సన్నాసులా... రాహుల్ గాంధీ సన్నాసులా అనే విషయం చెప్పాలి. అశోక్ నగర్ లో.. యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతున్న అంశం వాస్తవం కాదా రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు... ఆయన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిది. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన, నోటిఫికేషన్ల పైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలి. నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లను వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. గ్రూప్ వన్ మెయిన్స్ రేషియోను 1:100 గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి. అక్టోబర్ నవంబర్ 2023లో తెలంగాణ యువతను రెచ్చగొట్టి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టారు. అనేక అవాకులు చవాకులు పేలి, రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి యువతను రెచ్చగొట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story