
‘ప్రజలకు ప్రభుత్వాన్ని వేరు చేయడానికే జీహెచ్ఎంసీ విస్తరణ’
కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్న కేటీఆర్.
జీహెచ్ఎంసీని విస్తరించాలని తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. ఈ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ పెంచాలని ప్రయత్నిస్తోందన్నారు. అందుకు జీహెచ్ఎంసీ విస్తరణ అంటూ తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు.
‘‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చడం జరిగింది. అదే విధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు. తాండాలను అప్‌గ్రేడ్ చేసి 8,800 గ్రామ పంచాయతీలను 12,800కు పెంచడం జరిగింది. అధికారాన్ని వికేంద్రీకరించి, ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది’’ అని చెప్పారు.
‘‘ఈ విషయంలో ప్రభుత్వం ఎవరితో చర్చించిందో తెలియదు. ఎందుకంటే, మున్సిపాలిటీల్లో ఎలాంటి తీర్మానాలు జరగలేదు. ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం తీసుకోలేదు. మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి ప్రజలతో నేరుగా అభిప్రాయ సేకరణ చేశారా అంటే, అదీ చేయలేదు. అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారా, శాసనసభ పెట్టి సభ్యుల అభిప్రాయం తీసుకున్నారా అంటే అదీ లేదు’’ అని ఎద్దేవా చేశారు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో తమకైతే తెలియడం లేదని విమర్శించారు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదనను తెచ్చారో కూడా తెలీదంటూ చురకలంటించారు.
‘‘కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ఈ సందర్భంగానే పారిశ్రామిక భూముల పాలసీపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) పేరుతో కొత్త పాలసీని తీసుకువచ్చారని, పరిశ్రమలకు కేటాయించిన భూములు అపార్ట్‌మెంట్లకు ఇస్తున్నారని అన్నారు.
‘‘గతంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ప్రజలను ఒప్పించి, ఉపాధి అవకాశాల కోసం భూములను సేకరించిన తీరుగానే, గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరంలో 9,300 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించాయి. కానీ, ప్రస్తుతం ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకి భూములు తీసుకొని, వారికి తక్కువ ధర ఇచ్చి, సబ్సిడీపై పరిశ్రమలకు భూములిచ్చిన తర్వాత పరిశ్రమలు నడవాలి, ఉపాధి దొరకాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలని మేము ఆశిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘హైదరాబాద్‌లోని పరిశ్రమల యజమానులు వచ్చి, "అపార్ట్‌మెంట్లు కట్టుకుంటాము, మాల్స్ కట్టుకుంటాము" అంటే, వారికి అడ్దికి పావుశేరు చొప్పున మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరకు కాకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% మాత్రమే చెల్లించి, భూమిని కన్వర్ట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి అనుమతిస్తున్నాడు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో పార్కులకు, పార్కింగ్‌లకు, బొందలగడ్డలకు, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదు. వీటికి జాగాలు వద్దట. కానీ, పారిశ్రామికవేత్తలు అడ్దికి పావుశేరుకు కొనుక్కున్న, ప్రభుత్వం ఇచ్చిన భూములను వారు ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపుతున్నారు’’ అని తెలిపారు.
‘‘9,300 ఎకరాల భూమి దాదాపు ₹5 లక్షల కోట్ల విలువైన ఆస్తి. దేశంలోని ఇతర రాష్ట్రాలు (ఉదాహరణకు ముంబై) మిల్స్ కోసం ఇచ్చిన భూములను 50% వెనక్కి తీసుకొని, ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి 'అవినీతి అనకొండ'. రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములు, ఆయన అనుయాయులతో కలిసి ఒక అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏమిటంటే, ₹5 లక్షల కోట్లు విలువైన తెలంగాణ ప్రజల ఆస్తిని దోచుకుపోవడానికి, ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు’’ అని విమర్శించారు.
‘‘ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మాల్స్, అపార్ట్‌మెంట్లు కట్టుకోవడానికి వీలుగా వేల కోట్ల రూపాయలు ఆయన అనుయాయులు సంపాదించుకునేందుకు వీలుగా HILTP పాలసీని తీసుకువచ్చారు. వరంగల్ ప్రజలు కూడా ఈ దుర్మార్గాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. వరంగల్‌లోనూ రిజిస్ట్రేషన్ ధర తగ్గించి ప్రజల భూములను ప్రభుత్వం అమ్ముతుంది అంటే అనుమతిస్తారా? ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వారిని ఒప్పించి ప్రజల నుంచి సేకరించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కూడా, హైదరాబాద్‌లో వల్లెనే, రైతులకు నుంచి సేకరించిన భూములను రిజిస్ట్రేషన్ ధరల్లో 30%కే అపార్ట్‌మెంట్లు, మాల్స్ కట్టుకోవడానికి అనుమతిస్తే వరంగల్ ప్రజలు ఒప్పుకుంటారా? ఇది సరికాదు కదా!’’ అని అన్నారు. ఈ మోసాన్ని అడ్డుకోవడానికి ఒక కార్యాచరణ రూపొందిస్తాం, తప్పకుండా పోరాటం చేస్తామని తెలిపారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. లేకపోతే కచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని తెలిపారు.

