
పండగవేళ అలా జరగడం బాధాకరం: కేటీఆర్
శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో విద్యుదాఘాతానికి ఐదుగురు యువకులు మృతి.
శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను దేశమంతా ఘనంగా నిర్వహించారు. శ్రీకష్ణాష్టమిని పురస్కరించుకుని భారీగా ఊరేగింపులు కూడా నిర్వహించారు. ఇదే విధంగా తెలంగాణ రామాంతపూర్ గోకులేనగర్‌లో నిర్వహించిన ఊరేగింపులో విషాధఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఐదుగురు యువకులు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వార్త తనను ఎంతగానో కలచివేసిందన్నారు. పండగ వేళ ఇటువంటి దుర్ఘటన సంభవించడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున ఊరేగింపు చేశారు. అనంతరం ఊరేగింపు ముగించుకుని శ్రీకృష్ణ విగ్రహం ఉన్న రథాన్ని లోపలికి తీసుకొళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మరణించారని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉంది. ఈ ఘటనపై కేటీఆర్ తాజాగా స్పందించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.