
కేటీఆర్ లో ‘ఫార్ములా’ భయం స్పష్టంగా కనిపిస్తోందా ?
లోలోపల మాత్రం అరెస్టుభయం పెరిగిపోతున్నట్లు కేటీఆర్ ముఖ కవళికలు స్పష్టంగా చెబుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో ఫార్ములా కారు కేసు భయం మొదలైనట్లు అర్ధమవుతోంది. ఫార్ములా అంటే ఫార్ములా ఈ కార్(Formula E car case)రేసు కేసు అని అర్ధం. అధికారంలో ఉన్నపుడు అడ్డదిడ్డంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఫలితంగా తొందరలోనే తనపై చార్జిషీలు దాఖలవ్వటమో లేకపోతే ఏసీబీ(Telangana ACB) అరెస్టు చేయటమో ఖాయంగా కనబడుతోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కేటీఆర్(KTR) ఈ కేసును ఒక లొట్టపీసు కేసని, ఈకేసు వల్ల తనకేమీ కాదని, ఇలాంటి బెదిరింపులతో తాను భయపడనని పైకి చాలానే చెబుతున్నారు. అయితే లోలోపల మాత్రం అరెస్టుభయం పెరిగిపోతున్నట్లు కేటీఆర్ ముఖ కవళికలు స్పష్టంగా చెబుతున్నాయి.
అరెస్టు భయం ఎందుకు పెరిగిపోతోందంటే ఫార్ముల కేసు విచారణ జరగకుండా స్టే ఇవ్వాలని ముందు హైకోర్టులో కేసు వేశారు. అయితే కేసును విచారించిన కోర్టు విచారణకు స్టే ఎందుకు ఇవ్వాలని ఎదురు ప్రశ్నించింది. తనమీద ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలని కేటీఆర్ దాఖలుచేసిన కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో వెంటనే కేటీఆర్ సుప్రింకోర్టును ఆశ్రయించారు. తనపైన ఏసీబీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ను రద్దుచేయాలని, విచారణ జరగకుండా స్టే ఇవ్వాలన్న కేటీఆర్ అభ్యర్ధనను సుప్రింకోర్టు కూడా కొట్టేసింది. ఫార్ములా కేసులో విచారణ అవసరమని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. దాంతో ఏసీబీ విచారణ జరిపి చార్జిషీటు దాఖలు దాకా వ్యవహారం చేరుకుంది.
ఏసీబీకి ప్రభుత్వం, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే కేటీఆర్ పై ఏసీబీ చార్జిషీటు దాఖలు చేయటమో లేకపోతే అరెస్టు చేయటమో ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి. దీన్ని గ్రహించిన కేటీఆర్ మీడియా ముందు మాత్రం లేనిపోని బింకం కనబరుస్తున్నారు. ఏసీబీ కేసంటే తనకు లెక్కేలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ అధికార దుర్వినియోగంపై ఏసీబీ ఇప్పటికే అన్నీ ఆధారాలను సేకరించింది.
కేటీఆర్ పాల్పడిన అధికారదుర్వినియోగం ఒకటి కాదు చాలానే ఉన్నాయి. అవేమిటంటే ఫైనాన్స్ శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ ఖాతాలోని రు. 45 కోట్లను బ్రిటన్ కంపెనీ ఫార్ములా వన్ కంపెనీకి బదిలీచేయటం. రెండవది ఏమిటంటే క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు. బ్రిటన్ కంపెనీకి రు. 45 కోట్లను బదిలీచేసే ముందు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. అయితే ఇటు ఫైనన్స్ శాఖను అటు క్యాబినెట్ ను కూడా కేటీఆర్ పట్టించుకోలేదు. మూడోది విదేశీకంపెనీకి నిధులు బదిలీచేయాలంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. అయితే రిజర్వ్ బ్యాంకుకు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండానే నిధుల బదిలీ చేసేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత రిజర్వ్ బ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా వేసింది.
రిజర్వ్ బ్యాంకు విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. జరిమానా చెల్లించింది అంటేనే తప్పుచేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే కదా. తప్పు ఎందుకు జరిగింది ? ఎందుకంటే కేటీఆర్ వ్యవస్ధలను సక్రమంగా పనిచేయనీయక పోవటంవల్లే. నియమ, నిబంధనలను ఫాలో అవకుండా తనిష్టప్రకారం నిర్ణయాలు తీసుకోవటం వల్లే తెలంగాణ ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సొచ్చింది. చివరగా ఎన్నికల కమీషన్ అనుమతిలేకుండానే బ్రిటన్ కంపెనీకి నిధుల చెల్లించారు. వ్యవస్ధల్లో దేనిపనిని దాన్ని చేయనీయకుండా తప్పనితెలిసినా తనిష్టం వచ్చినట్లు పనిచేసుకోవటాన్నేఅధికార దుర్వినియోగం అనంటారు. ఇక అధికార దుర్వినియోగాన్ని పక్కన పెట్టేస్తే ఈ కార్ రేసు నుండి మధ్యలోనే తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీ నుండి బీఆర్ఎస్ కు రు. 45 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందాయి. కంపెనీ నుండి తన పార్టీకి కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు గురించి మాత్రం కేటీఆర్ మాట్లాడటంలేదు. ఈ విషయాన్ని ఏసీబీ తన రిపోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కేటీఆర్ కు వ్యతిరేకంగా ఏసీబీ యాక్షన్లోకి దిగటం ఖాయం. ఈ విషయం బాగా తెలుసుకాబట్టే కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఏసీబీ ఏ విధమైన యాక్షన్లోకి దిగుతుందనేది చాలా ఆసక్తిగా మారింది. ఏమి జరుగుతుందో చూడాలి.