‘ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాం’.. విద్యుత్ ఛార్జీలపై కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పది నెలల్లోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పది నెలల్లోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాజాగా కరెంటు కష్టాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం(సెస్)లో విద్యుత్ ఛార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్తు సరఫరాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక వ్యాపారంలా చూస్తోందని, అది సరైన పద్దతి కాదని హితవు పలికారు.
విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు కష్టం కలిగించేలా ఏ నిర్ణయం తీసుకున్నా తాము వ్యతిరేకిస్తామని, అధికారంలో ఎవరు ఉన్నా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగాలే తప్ప.. జేబులు నింపుకోవడమే పరమావధిగా కాదంటూ చురకలంటించారు. ‘విద్యుత్తు సరఫరా అంటే వ్యాపారం కాదు. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రం. డిస్కంలు అంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే గానీ.. ఖాజానాకు కంట్రిబ్యూషన్ అందించే సంస్థలు కాదు’’అని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఆయన మాటలు ప్రస్తుతం తెలంగాణ అంతటా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.
రాష్ట్ర ప్రజలపై రూ.18వేల కోట్ల భారం
విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.18వేల కోట్ల భారం మోపడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. ‘‘ప్రభుత్వానికి నిజంగా విజన్ అనేది ఉంటే ప్రజలకు కష్టపెట్టకుండా సంపద పెంచాలి. ఆ మొత్తాన్ని పేదల కోసం ఖర్చు పెట్టాలి. అదనపు ఆదాయం కోసం విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై రూ.18వేల కోట్ల భారం మోపడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్ధమైంది. వారు చేస్తున్న ఈ ఆలోచనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ హయాంలో ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడలేదు. అతిపెద్ద లిఫ్ట్ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించిన సమయంలో కూడా ప్రజలపై, రైతులపై భారం వేయలేదు’’ అని వివరించారు.
ఇదంతా ఒక కుట్ర
విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద కుట్ర చేస్తోందని, పెద్దపెద్ద వ్యాపారులకు పెద్దపీట వేయడానికే కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యుత్ సరఫరా సామర్థ్యాలను ఒకే కేటగిరిలోకి మార్చడంతో భారీ పరిశ్రమలున్న అదానీ వంటి వారు, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలు కూడా ఒకే పరిధిలోకి వస్తారు. ఇదంతా కూడా చిన్నిచిన్న పరిశ్రమల రాయితీలు ఎత్తేయడానికి చేస్తున్న కుట్రగానే తాము భావిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాన్ని వీడుతున్నాయి. కొత్త పెట్టుబడులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి.
పదేళ్లు వెనక్కు వెళ్లిన తెలంగాణ
‘‘తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలు కూడా విద్యుత్ ఛార్జీలతోనే జరిగింది. ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల తన పదవికి రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలబడ్డారు కేసీఆర్. ఎట్టకేలకు రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చామనుకునేలోపే పదేళ్లు గడిచి ఇప్పుడు మళ్లీ రాష్ట్ర తిరోగమనం చెందింది. మళ్ళీ ఎక్కడైతే ఉద్యమం మొదలైందో అదే విద్యుత్ ఛార్జీల పెంపు దగ్గరకు వచ్చింది ఆగింది. డిస్కంలతో పోలిస్తే సెస్‌లో వినియోగదారులకు అందించే సేవలు వందశాతం మెరుగ్గా ఉన్నాయి. సహాకార రంగంలోని ఏకైక సంస్థను మరింత బలోపేతం చేసేలా ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాలి’’ అని కేటీఆర్ కోరారు.