
కేసీఆర్ విషయంపై క్లారిటి ఇచ్చేసిన కేటీఆర్
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది కేవలం మూడురోజులు మాత్రమే
ఇంతకాలానికి కేసీఆర్ విషయంలో కొడుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటి ఇచ్చేశారు. ఇంతకీ కేటీఆర్ ఇచ్చిన క్లారిటి ఏమిటంటే కేసీఆర్ అసెంబ్లీకి రారని. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది కేవలం మూడురోజులు మాత్రమే. అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై రేవంత్(Revanth), మంత్రులతో పాటు మామూలు జనాల్లో కూడా నెగిటివ్ చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీకి హాజరవ్వనపుడు కేసీఆర్(KCR) కి ఎంఎల్ఏ పదవి మాత్రం ఎందుకని జనాలు నిలదీస్తున్నారు. ఆమధ్య కాంగ్రెస్(Congress), బీజేపీ నేతలు గజ్వేలులోని ఎర్రవల్లి ఫామ్ హౌస్(Yerrawalli farm house) మెయిన్ గేటుకు తాళంవేసి పెద్ద గోలచేసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ఆందోళన కూడా చేశారు. ఎవరెన్ని ఆందోళనలుచేసినా, డిమాండ్లు చేసినా కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావటంలేదు.
తొందరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు కాబట్టి ఏమో నిజంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారేమో అని అనుకున్నారు. అయితే తాజాగా కేటీఆర్(KTR) ఈ విషయమై క్లారిటి ఇచ్చేశారు. భవిష్యత్తులో కేసీఆర్(KCR) అసెంబ్లీ సమావేశాకు హాజరుకారని డైరెక్టుగానే చెప్పేశారు. గతంలో ఎన్టీఆర్(NTR), జయలలిత(Jayalalita), చంద్రబాబునాయుడు(Chandrababu) కూడా అసెంబ్లీని బహిష్కరించి తిరిగి ముఖ్యమంత్రులుగా మాత్రమే సభలోకి అడుగుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెడతారని కేటీఆర్ స్పష్టత ఇచ్చేశారు. అసెంబ్లీలో రేవంత్ బజారుభాష మాట్లాడుతున్నపుడు సభకు కేసీఆర్ ఎందుకు హాజరవ్వాలని ఎదురు ప్రశ్నించారు. రేవంత్ బజారుభాష వినటానికి కేసీఆర్ సభకు రావాలా ? అని కూడా అడిగారు.
కేసీఆర్ వయసు, స్ధాయి, అనుభవాన్ని కూడా చూడకుండా రేవంత్, మంత్రులు కావాలనే అవమానిస్తున్నపుడు అసెంబ్లీకి రావాల్సిన అవసరంలేదని కూడా సమర్ధించుకున్నారు. సభలో తమనే తట్టుకోలేకపోతున్న ప్రభుత్వానికి కేసీఆర్ దాకా ఎందుకు అంటు ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో ప్రభుత్వానికి సమాధానం చెప్పటానికి తాము చాలని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. మొత్తానికి అసెంబ్లీకి కేసీఆర్ రారుగాక రారని కేటీఆర్ క్లారిటి ఇచ్చేశారు. కాబట్టి అసెంబ్లీకి కేసీఆఆర్ వస్తారా ? రారా ? అన్న విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరంలేదు. ముఖ్యమంత్రిగానే కేసీఆర్ సభలోకి అడుగుపెట్టాలి అనేకల నెరవేరుతుందా లేదా అన్న విషయానికి కాలమే సమాధానం చెప్పాలి. మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం కోల్పోతారనే విషయమై కేసీఆర్ న్యాయనిపుణులతో చర్చించే ఉంటారనటంలో సందేహంలేదు. అసెంబ్లీకి కేసీఆర్ రారని కేటీఆర్ చెప్పారంటే తండ్రి, కొడుకులు మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటన వచ్చిందన్న విషయం తెలిసిపోతోంది.