కాంగ్రెస్ రాజ్యసభ సీటుపై కేటీఆర్ గోల
x
KTR

కాంగ్రెస్ రాజ్యసభ సీటుపై కేటీఆర్ గోల

ప్రతిరోజూ ఏదో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీపై గోల చేయనిదే, బురదచల్లనిదే కేటీఆర్కు నిద్రపట్టేట్లు లేదు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రతిరోజూ ఏదో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీపై గోల చేయనిదే, బురదచల్లనిదే కేటీఆర్కు నిద్రపట్టేట్లు లేదు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపైన కూడా కేటీఆర్ గోలచేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. తాజాగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు రాజ్యసభ ఎంపీ సీటును అభిషేక్ సింఘ్వీకి ఇవ్వటాన్ని తప్పుపట్టారు. తెలంగాణాలో వీహెచ్ లాంటి ఎందరో నేతలున్నపుడు తెలంగాణాతో ఎలాంటి సంబంధంలేని సింఘ్వీకి ఎందుకు ఇచ్చారంటు కాంగ్రెస్ పార్టీని నిలదీయటం విచిత్రంగా ఉంది.

తమకు వచ్చిన సీటును ఎవరికి ఇచ్చుకోవాలన్నది పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం ఇష్టమని అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ అంటే ప్రాంతీయపార్టీ కాబట్టి ఎవరికి పదవులు ఇచ్చుకున్నా తెలంగాణా వాళ్ళే అయ్యుంటారు. అదే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే జాతీయపార్టీ. జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రానికి చెందిన నేతను మరో రాష్ట్రం నుండి రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించటం దశబ్దాలుగా వస్తున్న ఆనవాయితేయే. ఇదే పద్దతి బీజేపీలో కూడా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు తెలంగాణా నుండి సంఘ్వీని రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేయటంతో కేటీఆర్ నానా గోలచేస్తున్నారు. ఒకవైపు సింఘ్వీ ఎంపికను తప్పుపడుతునే మరోవైపు వీహెచ్ లాంటి ఒకరిద్దరు నేతల పేర్లను ప్రస్తావించటం ద్వారా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తున్నారు.

ఇపుడింతగా గోలచేస్తున్న కేటీఆర్ తమ హయాంలో ఏమి చేశారన్నది విషయాన్ని మరచిపోయినట్లున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ కొందరిని రాజ్యసభకు ఎంపికచేశారు. అలాంటి వారిలో బీ పార్ధసారధిరెడ్డి అని ఒకాయన ఉన్నారు. ఈయన ఎవరంటే ఒక ఫార్మా కంపెనీకి ఓనర్. మరప్పుడు పార్టీలో ఎవరూ లేనట్లు, పార్టీకోసం కష్టపడిన ఎంతోమందిని కాదని పార్ధసారధిరెడ్డికి కేసీఆర్ రాజ్యసభ ఎంపీ పదవిని ఎందుకు ఇచ్చారు ?

పార్టీ పెట్టినప్పటినుండి కేసీఆర్, కేటీఆర్ కన్నా ఎంతో కష్టపడిన నేతలు బీఆర్ఎస్ లో చాలామంది ఉన్నారు. అలాంటివాళ్ళందరినీ కేసీఆర్ పట్టించుకోకుండా ఫార్మాకంపెనీ యాజమానిని ఎంపిక చేయటంలో మతలబు ఏమిటి ? అలాగే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గా రెండుసార్లు పనిచేసిన కే కేశవరావుది ఏపీలోని మచిలీపట్నం. తెలంగాణానే తమ ఆశ, శ్వాస అని చెప్పుకునే కేసీఆర్ మచిలీపట్నంకు సంబంధించిన కేశవరావుకు రాజ్యసభ ఎంపీ పదవిని ఎలాగిచ్చారు ? ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ను ఎలా చేశారు ? కేకే, గద్వాల స్ధాయిగలవాళ్ళు బీఆర్ఎస్ లో ఇంకెవరూ లేరా ?

కేసీఆర్ కు అధికారం ఉన్నపుడు తమిష్టం వచ్చినట్లుగా పదవులు ఇచ్చుకున్నారు. తమ అధికారాలను ఎవరూ ప్రశ్నించకూడదు. పార్ధసారధిరెడ్డిని రాజ్యసభకు కేసీఆర్ ఎంపికచేసినపుడు కేటీఆర్ ఎందుకని ఏమీ మాట్లాడలేదు ? పార్టీతో ఎలాంటి సంబంధంలేని వ్యక్తిని కేసీఆర్ రాజ్యసభకు ఎంపికచేసిన విషయం కేటీఆర్ కు గుర్తులేదా ? ఇపుడు కాంగ్రెస్ పార్టీ తరపున సింఘ్వీ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేయగానే కేటీఆర్ నానా గోలచేస్తున్నారు. ఇంతగోల ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ నేతలను అధిష్టానంపైకి రెచ్చగొట్టడం కోసమే అని అందరికీ అర్ధమవుతోంది. కేటీఆర్ ఎందుకు గోలచేస్తున్నారో తెలుసుకోలేని అమాయకులా హస్తంపార్టీ నేతలు. కాంగ్రెస్ అంతర్గత విషయాలపైన కూడా కేటీఆర్ వేలుపెట్టి లేనిపోని రచ్చ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

Read More
Next Story