KTR|కారు చిక్కుల్లో కేటీఆర్ ?
కేసుపెట్టి విచారణకు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే రాజకీయాల్లో కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా తగులుకున్నట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఫార్ములా కార్ రేసు(Formula Car Race)లో పెద్దఎత్తున జరిగిన అవినీతికి కేటీఆర్(KTR) కారణమని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందుకనే కేటీఆర్ మీద కేసు నమోదు చేసి విచారణకు అనుమతించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ)Governor Jishnudev Varma)ను ప్రభుత్వం అడిగింది. దాదాపు నెలన్నరక్రితం అడిగిన అనుమతికి గవర్నర్ ఇపుడు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే గవర్నర్ అనుమతి ఫైల్ ప్రభుత్వానికి చేరిందని తెలిసింది. కేటీఆర్ మీద కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ఏసీబీ(ACB Police) ఉన్నతాధికారులు కేసుపెట్టి విచారణకు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే రాజకీయాల్లో కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంతకీ ఫార్ములా ఈ కార్ రేసు కథ ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా కార్ రేసు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కార్ రేసుకు సంబంధించిన పనులను హెచ్ఎండీఏ ద్వారా చేయించారు. విదేశీకంపెనీతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి రు. 55 కోట్లను ఆర్ధికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే విదేశీకంపెనీకి హెచ్ఎండీఏ(HMDA) డైరెక్టర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అర్వింద్ కుమార్ చెల్లించేశారు. కార్ రేసు తొందరలోనే మొదలవ్వబోతోందని అనుకుంటున్న సమయంలో ఎన్నికలప్రకటన రావటంతో పనులన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఇంతేకాకుండా హెచ్ఎండీఏ ముందుగా ఒప్పందంచేసుకున్న కంపెనీని కూడా ఏకపక్షంగా మార్చేశారనే ఆరోపణలు బాగా వినిపించాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయాలంటే అందుకు ఆర్బీఐ అనుమతి తప్పనిసరి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇదేవిషయమై చీఫ్ సెక్రటరీ శాంతికుమారి విచారణ జరిపించారు. విచారణకు హాజరైన అర్వింద్ అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశల ప్రకారమే తాను రు. 55 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఫోన్ ద్వారా కేటీఆర్ చెల్లింపులపై తనకు ఆదేశాలు ఇచ్చారని అర్వింద్ రాతమూలకంగా చీఫ్ సెక్రటరీకి సమాధానంఇచ్చారు. దాంతో అర్వింద్ విచారణలో చెప్పిన వివరాల ఆధారంగానే కేటీఆర్ పాత్ర చాలా కీలకమని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. అందుకనే మొత్తం వ్యవహారాన్ని ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా కేటీఆర్ మీద కేసు నమోదు చేయటానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. దాదాపు నెలన్నర రోజులు ఫైల్ రాజ్ భవన్లోనే పెండింగులో ఉంది. కేటీఆర్ పై కేసు నమోదుకు సంబంధించిన న్యాయపరమైన సలహాను తీసుకున్న తర్వాతే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఒకటి రెండు రోజుల్లోనే కేసు నమోదు చేసే విషయమై ఏసీబీకి ప్రభుత్వం నుండి ఆదేశాలు అందే అవకాశం ఉంది. ఆదేశాలు అందిన వెంటనే కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదుచేసి విచారణకు రమ్మని నోటీసులు జారీ చేస్తుంది. విచారణకు కేటీఆర్ హాజరవ్వచ్చు లేదా నోటీసులను సవాలు చేస్తు కోర్టులో కేసూ వేయచ్చు. ఒకవేళ విచారణకు హాజరైతే అరెస్టుచేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే కేటీఆర్ కూడా అరెస్టు విషయంలో మానసికంగా సిద్ధంగానే ఉన్నారు. తనను ఏదో కేసులో అరెస్టుచేయటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ చాలాసార్లు బహిరంగంగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కొద్దిరోజులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) చెబుతున్నట్లుగా పొలిటికల్ బాంబు ఇదేనా ? లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నది చూడాలి.