తేరుకోలేని స్థితికి తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
x

తేరుకోలేని స్థితికి తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వల్ల ప్రజలెవరికీ సంక్షేమం చేరువకాలేదన్నారు.


కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వల్ల తెలంగాణ(Telangana) రాష్ట్రం తీవ్రాతి తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. కాంగ్రెస్ వల్ల ప్రజల్లో ఎవరికీ సంక్షేమం చేరువ కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణకు పట్టిన ఒక శాపం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఎల్లప్పుడూ తమ పార్టీ బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని, కాంగ్రెస్‌తో తమ కొట్లాట కూడా రాష్ట్ర బాగు కోసమేనని వివరించారు. ప్రజలకు కష్టం వచ్చిందంటే వారికి అండగా ఉంటామని, ప్రజల తరుపున పోరాడటమే తమ పార్టీ పరమావధి అని చెప్పుకొచ్చారు. వీరి కోసం తాను చివరి శ్వాస వరకు పోరాడతానని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం అతి త్వరలోనే పాద యాత్ర కూడా చేయనున్నట్లు చెప్పారు.

బీఆర్ఎస్ సర్కార్ తథ్యం

మళ్ళీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అందులో సందేహం అక్కర్లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగెత్తి పోయారని, మిగిలిన నాలుగేళ్లు వీళ్లను భరించాలా అన్న భావనలో ప్రజలు బతుకుతున్నారంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలను మరిచి పార్టీ కాంగ్రెస్ అయితే హామీ ఇవ్వకపోయినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ది అని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణకు కాంగ్రెస్సే శాపం

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు కేటీఆర్. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు. అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తోంది. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. వీటికి భయపడేది లేదు’’అని కేటీఆర్ అన్నారు.

మోసపోయిన రైతన్నలు

సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్‌గా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక, రైతుబంధు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి తరపున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.

అంధకారంలోకి తెలంగాణ

నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగితక పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వదిలి వెళ్ళిపోతున్నాయన్నారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు. అంతేకాకుండా మరెన్నో కీలక అంశాల గురించి కూడా ఎక్స్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ప్రజలతో పంచుకున్నారు.

Read More
Next Story