దీపావళికి రైతులను దివాళా తీయిస్తారా?: కేటీఆర్
రైతులకు కాంగ్రస్ ప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రైతులకు కాంగ్రస్ ప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతులు, రైతాంగం పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర నిర్లక్ష వైఖరి చూపుతోందని, ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రోజుల తరబడి మూలుగుతున్నా వాటిని కొనాలంటూ అధికారులకు ప్రభుత్వం ఎందుకు ఆదిశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని, రైతులు తమ బాధలను చెప్పుకుంటున్నా అవి వినిపించనట్లే ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ ధాన్యం కొనుగోళ్లపై ఎందుకు పెట్టరు? రైతులంటే అంత అలుసైపోయారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గారడీ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అబద్దపు హామీలను నమ్మి ప్రజలకు పూర్తిగా మోసపోయారని, రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి రైతులను ఆదుకోవడంపై దృష్టిపెట్టాలని కేటీఆర్ కోరారు. దయచేసి రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ల్ చేశారు.
ఏం పట్టదాయే..
‘‘దసరాకే కాదు..దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా?
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా..ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే..ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే!!
రాజకీయాలపై పెట్టిన దృష్టి...ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు?
మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా?
రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి..దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండి..’’ అని కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.