KTR
x

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం’

కాంగ్రెస్ ఏదో చేస్తుందని ఖమ్మం జిల్లాలో 9 సీట్లను కట్టబెడితే ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయారు.


తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎరువులు, నీళ్లు, విత్తనాలు అందక రైతులు ఆగం అవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు. ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ అని మాయమాటలు చెప్పి వారిని దారుణం మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ చిత్తుఅవుతుందని, బీఆర్ఎస్‌కు వంద సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ అన్నం పెడుతుంటే రేవంత్ బిర్యానీ పెడతాడని భావించి ఓట్లు వేస్తే ఉన్న కూడును కూడా లాక్కుంటున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తన ఖమ్మం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.

‘‘ఓటు వేసిన పాపానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమను కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఖమ్మం లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణలోని ప్రతీ రంగాన్ని, ప్రతీ ఒక్కరిని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దాకా తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా , ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేసినా వదిలపెట్టేది లేదన్నారు. ప్రజలను పీక్కు తింటున్న రేవంత్ రెడ్డి భరతం పడతాం’’ అని హెచ్చరించారు.

‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి పటిష్ట పునాదులు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో కేసీఆర్ గారు పది సంవత్సరాలు పనిచేశారు. వ్యవసాయం, సాగునీటి,పట్టణ అభివృద్ధి, పల్లె ప్రగతి ,విద్యా, వైద్యం, గిరిజన,దళిత సంక్షేమం, మైనార్టీ, మహిళలతో పాటు బలహీన రంగాలకు సంక్షేమం కోసం పనిచేసి ప్రతి రంగంలో భారతదేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపాము. ఇవాళ తెలంగాణ పాటిస్తే రేపు దేశం అనుసరిస్తుంది అన్నట్టు పని చేశాము. 2014లో కేవలం 63 సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ 2018 నాటికి 88 సీట్లను ఎక్కువ గెలుచుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి 2023 లో మాత్రం ప్రజలు వారికి అధికారాన్ని కట్టబెట్టారు’’ అని అన్నారు.

‘‘బోగస్ మాటలతో రైతులను, ఆగం పట్టించిండ్రు. రాహుల్, ప్రియాంక గాంధీ లను పిలిపించి యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులను బురిడీ కొట్టించారు. ఫ్రీ బస్సు, నెలకు 2500, తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను దగా చేశారు. పెద్ద మనుషుల్లో ఇద్దరికీ నెలకు 4000 పెన్షన్ ఇస్తామని వాళ్లను కూడా ఘోరంగా మోసం చేశారు. 42% రిజర్వేషన్ల పేరుతో, బీసీ సబ్ ప్లాన్, లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి బీసీలను మోసం చేశారు. ఖమ్మంలో ఉన్న ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా 2023లో పార్టీకి నష్టం జరిగింది. ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ కాటేసి కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఈరోజు ఎన్నికలు జరిగితే 100 సీట్లతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారన్న నిజం కాంగ్రెస్ బిజెపిలకు తెలుసు. ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఊహించలేదు’’ అని చురకలంటించారు.

‘‘అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రీకాల్ వ్యవస్థను రాజ్యాంగంలో పెట్టలేదు. అందుకే తెలంగాణ ప్రజలు మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓపిగ్గా భరించాల్సి వస్తుంది. ఒక్క తప్పు ఓటు వేసినందుకు ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రతినాయకుడు ఉంటేనే నాయకుడి విలువ తెలుస్తుంది. గుర్రం విలువ తెలవాలంటే గాడిదను చూడాలి. కాంగ్రెస్ అనే గాడిద తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకాలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి దర్జాగా తిరుగుతున్నారు. ఒకరు బాంబులేటిగా మారితే ఇంకొకరు కమిషన్ దందాల్లో మునిగి పోయారు. ఎరువులు, విత్తనాలు దొరకక రైతులు గోసపడుతుంటే ఏం చేయాలో అర్థం కాక వ్యవసాయ మంత్రి తుమ్మల తల పట్టుకున్నాడు’’ అని విమర్శించారు.

‘‘రెండు లక్షల టన్నుల ఎరువుల కొరత ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఎరువుల దుకాణాల ముందట చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి మళ్లీ ఆనాటి నికృష్ట రోజులు కాంగ్రెస్ పాలనలో వచ్చాయని రైతులు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడు సంవత్సరాలు సమయం ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి వాటిలో సత్తా చాటాలి. ఇప్పటిదాకా మా కోసం కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కష్టపడి ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ లుగా వారిని గెలిపించుకుంటాం. ప్రభుత్వం మీద ప్రజలకు పీకల దాకా కోపం ఉంది. ఈ వ్యతిరేకతను సరిగ్గా వాడుకుంటే ఖమ్మం, కొత్తగూడెం జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది. యువకులు ముందుకొచ్చి కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించగలిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పూర్వ ఖమ్మం జిల్లాలోనే ఈ అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ ఏదో చేస్తుందని ఖమ్మం జిల్లాలో 9 సీట్లను కట్టబెడితే ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయారు’’ అని అన్నారు.

‘‘కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దాకాఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా , ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేసినా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భరతం పడతాము. ప్రజాబలం ముందు ఎవరైనా తలవంచాల్సిందే అన్న సందేశాన్ని ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం. డబ్బులు పంచి గెలుస్తామన్న భ్రమల్లో కాంగ్రెస్ ఉంది. మరో కేసీఆర్ లాగా ప్రతీ బిఆర్ఎస్ కార్యకర్త కదిలితే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో మంచి ఫలితాలు వస్తాయి. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

Read More
Next Story