చంద్రబాబు భజన మొదలుపెట్టిన కేటీఆర్
చంద్రబాబు హయాంలో చాలా క్రీడలపోటీలు జరిగాయి ఎక్కడా బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగా భారీ కుంభకోణం ఆరోపణలు రాలేదు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఫార్ములా కార్ రేసు నిర్వహణ ఏర్పాట్లలో జరిగిన కుంభకోణంలో కూరుకుపోవటం ఖాయమని కేటీఆర్ కు అర్ధమైనట్లుంది. అందుకనే సడెన్ గా సంబంధంలేకపోయినా చంద్రబాబునాయుడు భజన మొదలుపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా కారు(Formula 1 Car Race) రేసు నిర్వహణ ఏర్పాట్లకు సుమారు రు. 100 కోట్లు ఖర్చు జరిగింది. ఇందులో రు. 55 కోట్లను కారు రేసు మొదలుకాకముందే సంబంధంలేని సంస్ధకు బదిలీచేశారన్నది తీవ్రమైన ఆరోపణ. రు. 55 కోట్లు ఇచ్చింది అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టరుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. నిదుల బదిలీకి సంబందించి చీఫ్ సెక్రటరీ జరిపిన విచారణలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్(KTR) ఆదేశాల ప్రకారమే తాను రు. 55 కోట్లు బదిలీ చేసినట్లు అర్వింద్ చెప్పారు. నిధుల బదిలీ ఆదేశాలను చూపించమని చీఫ్ సెక్రటరీ అడిగినపుడు కేటీఆర్ రాతమూలకంగా ఆదేశాలు ఇవ్వలేదని ఫోన్లో ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
కేటీఆర్ మౌఖిక ఆదేశాల వల్లే తాను కోట్లరూపాయలను బదిలీచేసినట్లు అర్వింద్ విచారణలో అఫిడవిట్ ఇచ్చినట్లు సమాచారం. కుంభకోణంలో అర్వింద్ పాత్రపై ఏసీబీ(ACB) విచారణ చేస్తోంది. పనిలోపనిగా అర్వింద్ సాక్ష్యం ఆధారంగా కేటీఆర్ ను కూడా ఏసీబీ విచారించే అవకాశం ఉందని, అవసరమైతే అరెస్టు కూడా చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అరెస్టుకు కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధమైపోయినట్లు అర్ధమవుతోంది. రాజకీయ నేతకదా అరెస్టవ్వటం ద్వారా జనాల సానుభూతి సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నట్లున్నారు. ఈవిషయం బయటకు చెప్పలేదు కాని మీడియాతో మాట్లాడినపుడు సంబంధంలేని చంద్రబాబు(Chandrababu Naidu)ను పిక్చర్లోకి తీసుకొచ్చారు. ఇండియాలో ఫార్ములా వన్ రేసింగును నిర్వహించాలని చంద్రబాబు 2003లోనే ప్రయత్నించినట్లు చెప్పారు. అప్పట్లో ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీపడిన విషయాన్ని గుర్తుచేశారు.
కామన్ వెల్త్ గేమ్స్(Commonwealth Games) నిర్వహణలో కుంభకోణమంటే అందరికీ కాంగ్రెస్(Congress) ప్రభుత్వమే గుర్తుకొస్తుందని కూడా అన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహణకు చంద్రబాబు ప్రయత్నంమాత్రమే చేశారు. కాని బీఆర్ఎస్(BRS) హయాంలో నిర్వహణ పేరుతో భారీ కుంభకోణమే జరిగింది. రేసు నిర్వహణకు సుమారు రు. 100 కోట్ల ఖర్చంటే అందులో రు. 55 కోట్లు అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. తాను ఎలాంటి కుంభకోణనికి పాల్పడలేదని చెప్పుకోవాలి లేదా కుంభకోణానికి బాధ్యుడినని అంగీకరించాలి. అంతేకాని ఎలాంటి సంబంధంలేని చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తెచ్చారో అర్ధంకావటంలేదు. చంద్రబాబు హయాంలో చాలా క్రీడలపోటీలు జరిగాయి ఎక్కడా బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగా భారీ కుంభకోణం ఆరోపణలు రాలేదు. బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా రేసింగు ఏర్పాట్లకు చేసిన ఖర్చుకన్నా జరిగిన అవినీతే ఎక్కువగా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.