‘రేవంత్ పేరు భీమవరం బుల్లోడు’
x

‘రేవంత్ పేరు భీమవరం బుల్లోడు’

తాను ఆంధ్రలో చదువుకుంటే రేవంత్‌కు నొప్పేంటో అర్థం కావట్లేదంటూ కేటీఆర్ చురకలు.


సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విసుర్లు విసిరారు. భీమవరం బుల్లోడంటూ మరో పేరు పెట్టారు. తాను గుంటూర్లో చదువుకున్నా పదేపదే అనే రేవంత్.. ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకోలేదా అని అన్నారు. ‘నేను ఆంధ్రలో చదివితే తప్పు ఆయన మాత్రం ఆంధ్ర అల్లుడిని తెచ్చుకోవచ్చా’ అంటూ చురకలంటించారు. అందుకే చిట్టినాయుడి పేరుమారుస్తున్నా అంటూ సెటైర్లు వేశారు. ఈ సందర్బంగానే రేవంత్‌కు భీమవరం బుల్లోడు పేరుపెట్టినా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఒక్క ప్రెస్‌మీట్‌కే చెమటలు పట్టాయా..

కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేడన్నట్టుగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

రేవంత్ గెలవకుండా చేయడం నా బాధ్యత

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తన చదువు, భాషలపై జరుగుతున్న విమర్శలకు స్పందించారు. తాను గుంటూరులో చదువుకున్నానని, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకున్నానని పేర్కొంటూ, నేర్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. గుంటూరులో ఇంటర్ చదివానని చెబుతూ, రేవంత్ రెడ్డి కుటుంబ నేపథ్యంపై కూడా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి “మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు” అని కేటీఆర్ ప్రశంసించారు. తన తండ్రి పేరును గర్వంగా చెప్పుకుంటానని స్పష్టం చేశారు. సంచులు మోసే రాజకీయాలు చేస్తే చరిత్ర గుర్తుంచుకోదని విమర్శించారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలవకుండా చేయడం తమ బాధ్యత అని అన్నారు.

హామీలు అమలు చేయమంటే కోపం

రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ ప్రశ్నించారని తెలిపారు. 10 శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరడం తప్పేమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే సీఎం రేవంత్ రెడ్డికి కోపం వస్తోందని విమర్శించారు.

ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని చేసిన హామీలను కేటీఆర్ గుర్తుచేశారు. అవన్నీ అమలు చేయకుండా ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్నారని మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే బడ్జెట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.

ఢిల్లీలో సంచులు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నావ్

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. ఢిల్లీకి సంచులు మోసి పదవులు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. మహిళలకు ఇవ్వాల్సిన రూ.2,500, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, దమ్ముంటే రాజీనామా చేసి ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు. పేరులో గాంధీ ఉన్నా, పనులు మాత్రం భూకబ్జాలేనని ఆరోపించారు. అల్విన్ కాలనీలో సమావేశం పెట్టాలంటే ఫంక్షన్ హాల్ యజమానిని బెదిరించారని కూడా తెలిపారు.

కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయం

హైదరాబాద్ చరిత్రలో ఎవరితో సంబంధం లేకుండానే బీఆర్ఎస్‌కు జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్ అప్పగించారని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సరైన నాయకులకు అవకాశం ఇస్తామని, స్థానిక నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు గెలిస్తే కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేయవచ్చని అన్నారు. హైదరాబాద్‌ను ఎన్ని ముక్కలు చేసినా నిర్ణయం ప్రజలదేనని వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కొందరు మంత్రుల కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

Read More
Next Story