‘రేవంత్ పాదయాత్ర ఒక స్టంట్’.. కేటీఆర్ కీలక ఆరోపణలు
x

‘రేవంత్ పాదయాత్ర ఒక స్టంట్’.. కేటీఆర్ కీలక ఆరోపణలు

బాధితులు హైదరాబాద్‌లో ఉంటే సీఎం నల్లగొండలో పాదయాత్ర చేయడం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్.. రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా ఒక రాజకీయ స్టంట్ మాత్రమేనని, ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ దీనిని చేపట్టారంటూ విమర్శలు గుప్పించారు. మూసీ నది విషయంలో కాంగ్రెస్ దీర్ఘకాలిక నిర్లక్ష్యం, మూసీ పునరుజ్జీవ బాధితుల బాధల నుంచి దృష్టి మళ్లించడానికి సీఎం రేవంత్ రెడ్డి.. నల్గొండలో పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిన దారుణాలన్నీ హైదరాబాద్‌లో చేసి పాదయాత్ర మాత్రం నల్గొండలో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌లొ భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లను కోల్పోయే అవకాశం ఉన్న బాధితులను కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగానే ఆయన సీఎం రేవంత్‌పై విమర్శల గుప్పించారు. ‘‘రేవంత్ రెడ్డి పాదయాత్ర.. గాయం కాలికైతే బోడి గుండుకు మందు రాసినట్లు ఉంది. మూసీ ప్రాజెక్ట్ బాదితులు హైదరాబాద్‌లో ఉంటే నల్గొంటలో పర్యటిస్తారా మీరు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి.. వేల మందిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టారు.

ఏం చేస్తున్నారు రేవంత్ సారూ..: కేటీఆర్

‘‘మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు. హైదరాబాద్‌లో మూసి బాధితులు ఉంటే.. నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? కూల్చిన ఇండ్లెక్కడ.. కాలిన కడుపులెక్కడ.. నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ? ఆగిన గుండెలెక్కడ? రగిలిన మనసులెక్కడ? నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ? నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ ? నీ కుట్రలకు అంబర్ పేట్, అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ ? నీ మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైంది. గోల్నాక గొల్లుమంటుంది. దిలుషుక్ నగర్ ఢీలా పడింది.

అయ్యా సంబరాల రాంబాబు నీ అన్యాయానికి.. అవేదనలు, ఆవేశాలు, ఆక్రందనలు వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి అక్కడ కాదు.. రా ఇటు వైపు రా.. ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర. తేలు మంత్రం రానోడు .. పాము కాటుకు మంత్రం ఏసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకులల్ల మన్ను పోసినవ్. నాయకత్వం అంటే కూల్చడం కాదు..నిర్మించడం. నాయకత్వం అంటే తోవ తప్పడం కాదు.. తోవ చూపడం’’ అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు.

కాంగ్రెస్, టీడీపీలే అందుకు కారణం..

అంతేకాకుండా ఆరు దశాబ్దాలుగా మూసీ నదిని నిర్లక్ష్యం చేస్తూ, మూసీ నదిని డ్రైనేజీ కెనాల్‌గా మార్చి చివరకు మురికి నదిగా మార్చిన ఘనత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని ఆరోపించారు. ఇన్నాళ్లూ గుర్తురాని మూసీ పరిస్థితి.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు గుర్తొచ్చిందా అని కేటీఆర్ చురకలంటించారు. ఆనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వంకానీ మూసీ నదిని బాగు చేయాలని కలలో కూడా అనుకోలేదని, అందుకే మూసీ ప్రక్షాళన అంశం తెరపైకి వచ్చిన ప్రతి సారీ ఏదో ఒక కుంటిసాకు చెప్తూ అటకెక్కించేశారని ఆరోపించారు కేటీఆర్. కానీ తమ ప్రభుత్వం మాత్రం మూసీ ప్రక్షాళనను సీరియస్‌గా తీసుకుని, మూసీలోకి డ్రైనేజీ నీరు చేరకుండా రాష్ట్రవ్యాప్తంగా 30 వరకు వాటర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లను నిర్మించిందని గుర్తించారు.

శ్రద్ధ వహిస్తే మీకే తెలుస్తోంది..

‘‘మీ నిర్లక్ష్యానికి బాధితులుగా మారిన వారి పట్ల మీరు కారుస్తున్న మొసలి కన్నీరుకు ఈ పాదయాత్ర ఒక నిదర్శనం. మీరు నిజంగా ఆలోచిస్తే.. రైతులకు మీరే క్షమాపణలు చెప్తారు. మూసీ ప్రాజెక్ట్ బాధుతులను కూడా నేరుగా పరామర్శిస్తారు’’ అని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. కమిట్‌మెంట్ల కన్నా కమీషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటూ కీలక ఆరోపణలు చేశారు. మూసీ లూటిఫికేషన్ ప్రాజెక్ట్‌పై కన్సల్టెంట్లతో రోజుల తరబడి చర్చించడానికి సీఎం దగ్గర సమయం ఉంటుందే తప్ప.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించడానికి మాత్రం సమయం ఉండటం లేదని ఎద్దేవా చేశారు. ఆయన విధానాల వల్ల నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఘోరం

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం సమర్థించదగ్గ చర్య కాదని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్న మూసి పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. నిర్బంధంలోకి తీసుకున్న మా పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి లను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము’’ అని కేటీఆర్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు.

Read More
Next Story