
కాంగ్రెస్‌ని గల్లా పట్టి అడిగాలి: కేటీఆర్
420 హామీలు ఇచ్చి రాష్ట్రంలో అందరిని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడ్డ కేటీఆర్.
కాంగ్రెస్ పార్ట తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహంచారు. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏమీ ఇవ్వదని, గల్లా పట్టి అడిగితేనే ఇస్తారని అన్నారు కేటీఆర్.
‘‘కేసీఆర్ దీక్ష సమయంలో ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాల్లో ఆటోడ్రైవర్ లు కూడా ముందుండి పోరాడారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కార్మిక పక్షపాతి కేసీఆర్. రెండేళ్ళలో మార్పు మార్పు అంటూ మోసం ఎలా ఉంటుందో అందరికీ అర్దం అయింది. మష్రత్ అలీ ఆటోలో ఎక్కి హామీలు ఇచ్చిండు రాహుల్ గాంధీ. నేడు అలీ రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకుంటుండు’’ అని అన్నారు.
‘‘రైతులకు రుణమాఫీ చేశామని దేవుళ్ళపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారు. 420 హామీలు ఇచ్చి రాష్ట్రంలో అందరిని మోసం చేశారు. నెలకు వెయ్యి చొప్పున, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రెండేళ్లకు రూ. 1560 కోట్లు అప్పు పడి ఉన్నారు. జిల్లాలో అన్నిరకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తా. అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డుపెట్టకుంటే, హైదరాబాద్ లో మహాధర్నా చేద్దాం. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు, గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు’’ అని పునరుద్ఘాటించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

