KTR | ‘తెలంగాణలో అరడజను దొంగల పాలన’
ప్రతి రైతుకు, రైతు కూలీకి రూ.15వేలు రైతు భరోసా ఇవ్వాలి.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అలీబాబా అరడజను దొంగల పాలన సాగుతోందని చురకలంటించారు. తన సోదరిడితో సహా ఆరుగురు సభ్యులతో కూడిన ముఠాను కంపెనీల్లో వసూళ్లు చేయడానికి రేవంత్ తిప్పుతున్నారని అన్నారు. చేవెళ్లలో చేపట్టిన రైతు దీక్ష వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత పాలనలో తెలంగాణకు గానీ, తెలంగాణ రైతాంగానికి గానీ ఒరిగిందేమీ లేదన్నారు. అవసరాన్ని బట్టి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రేవంత్ సర్కార్ ఆపసోపాలు పడుతుందని విమర్శించారు. వీళ్లు చేస్తున్న కబ్జాలు, భూ దందాలు, వసూళ్లు, బ్లాక్‌మెయిలళ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అనేక అంశాలను అనవసరంగా తెరపైకి తీసుకొస్తుందని కేటీఆర్ విమర్శించారు. కొన్ని రోజులు కాళేశ్వరం, ఇంకొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ కాలయాపన చేస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పటావుతున్నాయని చెప్పారు.
బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే
‘‘బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తామన్న 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి. బడుగు బలహీన వర్గాల తరుపున కాంగ్రెస్‌ను అడుగడుగునా ప్రశ్నిస్తాం. బీసీలకు రిజర్వేషన్‌లు దక్కేవరకు పోరాడతాం. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే అది జరగదు. ఇలాంటి ఎన్నో చూశాం. ఎన్ని కేసులు పెట్టినా వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాలలో జరుగుతున్న విషయాలు, కాంగ్రెస్ చేస్తున్నమోసాలపైన దృష్టిసారిస్తే మంచిది. సొంత పార్టీ నాయకులనే పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్‌పై ఫోకస్ పెట్టాలి. సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ నాయకులను హత్య చేస్తే కాపాడుకోలేని వారు కూడా వచ్చి మాకు నీతులు చెప్తున్నారు’’ అని విమర్శించారు.
రైతుల కోసమే మా పోరు
‘‘తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా చేయాలన్న లక్ష్యంతోనే మా పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే ఈ దీక్ష చేపట్టాం. 21న నల్లగొండలో రైతు ధర్నా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరుతో మోసం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసాను ఈ ప్రభుత్వం ఎత్తేస్తుంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పిన రేవంత్.. రాష్ట్రంలోని ఇప్పుడు 22 లక్షల మంది రైతుల గురించి మాట్లాడటం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ని వదిలిపెట్టం. మా పార్టీకి ఆయువు పట్టులా ఉన్న రైతన్నల కోసం నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం. విచారణల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేసిన మా పోరు ఆగదు. మళ్ళీ చెప్తున్నా రేవంత్‌కు ధైర్యం ఉంటే లైవ్‌లో లై డిటెక్టర్ టెస్ట్‌కు ఓకే చెప్పాలి. విచారణల పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.10కోట్లు వృధా చేసింది. ఈ డబ్బుతో వందల మంది రైతన్నలకు, వృద్ధులకు ఆర్థిక భరోసా అందించవచ్చు. ఇప్పటికైనా పర్వాలేదు. లై డిటెక్టర్ పరీక్షకు వస్తే అతి తక్కువ ఖర్చుతోనే ఎవరు తప్పు చేశారో తెలిసిపోతుంది’’ అని ఛాలెంజ్ చేశారు.
అసలు ఆర్ఎస్ఎస్ మనిషి రేవంతే
అనంతరం ఢిల్లీ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అంటే ‘బీఆర్ఎస్ఎస్’ అని అర్థం అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ‘‘హెగ్డేవార్‌ను ప్రశంసించిన రేవంత్.. అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి. ఏబీవీపీలో, ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసింది రేవంత్. మేము కాదు. ఆయన వేసుకున్న నిక్కర్ కూడా ఖాకీ నిక్కర్ అని గతంలో అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ-కాంగ్రెస్, ఏసీబీ-ఈడీ కలిసి ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ప్రజల తరపున ప్రశించడం ఆపే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు.
ఉపఎన్నికలు పక్కా
‘‘రాష్ట్రంలో అతి త్వరలోనే ఉపఎన్నికలు రానున్నాయి. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ఇప్పటికే ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున అప్పుడు వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఇప్పుడు ఉప ఎన్నికలపైన వాదిస్తున్నారు. ఈ ఏడాదిలో ఉప ఎన్నికలు రావడం తథ్యం. ఆ పది నియోజకవర్గాల్లో అనేక మంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ పది నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్టీ ఫిరాయించిన నేతలను ఎండగడతాం’’ అని తెలిపారు కేటీఆర్.