కేటీఆర్ నానా అవస్ధలు పడుతున్నారా ?
x
KTR

కేటీఆర్ నానా అవస్ధలు పడుతున్నారా ?

ఇంతకీ ఆయన చేసిన ఆరోపణ ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమట.


ఏం మాట్లాడలో తెలీక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నానా అవస్తలు పడుతున్నట్లున్నారు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డుగోలు ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం తమపార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో వివాదాస్పదమైన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను సందర్శంచేందుకు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పూర్తయ్యేటప్పటికి అధినేత కేసీఆర్ నుండి వచ్చిన ఆదేశాలతో అందరు తిరిగొచ్చేశారు. అందుకనే శనివారం నాడు తమ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్నారు.

మీడియాతో మాట్లాడేటపుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విచిత్రమైన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆరోపణ ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమట. ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవటానికి కాంగ్రెస్ కుట్రచేసిందట. ని= పిల్లర్లు కుంగిపోయేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తోందనే అనుమానాలున్నట్లు కేటీఆర్ అనుమానాలు వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమి జరిగినా మొత్తం బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేటీఆర్ హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలోని ఒకరిద్దరు మంత్రులు బ్యారేజీని ఏమైనా చేయగలరని ఒక పిచ్చి ఆరోపణ కూడా చేశారు. తమ హయాంలో లక్షల క్యూసెక్కుల నీరొచ్చినా చెక్కుచెదరని మేడిగడ్డ ప్రాజెక్టులో సరిగ్గా ఎన్నికలకు ముందు నవంబర్లోనే సమస్యలు ఎందుకు మొదలయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ పదేళ్ళహయాంలోనే మేడిగడ్డ బ్యారేజిని కేసీయార్ నిర్మించారు. ఎన్నికలకు ముందు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే బ్యారేజీలోని నాలుగు పిల్లర్లు కుంగిపొయాయి. పిల్లర్లు కుంగిపోయిన కారణంగానే డ్యాం శ్లాబు, ప్లాట్ ఫారమ్ కు అక్కడక్కడ పెద్ద బీటలొచ్చేశాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడిన మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యతలోని డొల్లతనాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా అడ్వాంటేజ్ తీసుకున్నాయి. నాణ్యతా లోపాలపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నానా రచ్చచేశాయి. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. బయటపడిన ప్రాజెక్టు లోపాలతో తమకు ఏమీ సంబంధంలేదన్నట్లుగానే కేసీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి విచారణ కమిషన్ వేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి, నిర్మాణలోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. విచారణకు హాజరైన ఇరిగేషన్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత అప్పటి పాలకులదే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులను పర్యవేక్షించిన, నిధులు విడుదలచేసిన ఐఏఎస్ అధికారులు కూడా పూర్తి బాధ్యత పాలకులదే కాని తమది కాదని స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాము మౌఖింగా చెప్పిన విషయాలనే అఫిడవిట్ల రూపంలో ఇవ్వమని జస్టిస్ ఘోష్ సీనియర్ ఐఏఎస్ అదికారులతో పాటు ఉన్నతాధికారులు, నిపుణులను కూడా అడిగారు. ఇప్పటికే చాలామంది తమ అపిడవిట్లను కమిషన్ కు అందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నీటినిల్వకు పనికిరాదని నేషనల్ సేఫ్టీ డ్యాం అథారిటి నిపుణులు కూడా ఇప్పటికే తేల్చి చెప్పేశారు.

వాస్తవాలు ఇలాగుంటే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వంది బాధ్యత ఎలాగవుతుందో కేటీఆరే చెప్పాలి. నిర్మించింది తమ హయాంలోనే, లోపాలు బయటపడి పిల్లర్లు కుంగిపోయింది తమ కూడా హయాంలోనే. అందుకు బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని కేటీఆర్ చెప్పటమే విచిత్రంగా ఉంది. లక్షల క్యూసెక్కుల వరదవచ్చినా చెక్కుచెదరని మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకు కుంగిపోయిందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. పిల్లర్లు ఎందుకు కుంగిపోయిందో చెప్పాల్సింది ప్రాజెక్టును నిర్మించిన నిర్మాణ సంస్ధ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రాజెక్టును ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఐఏఎస్ సీనియర్ అధికారి స్మితా సబర్వాల్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఏమి సంబంధం ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికే ప్రాజెక్టుకు జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. ప్రాజెక్టును నాసిరకం నాణ్యతతో నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ఎలాంటి బాధ్యత లేదని కేటీఆర్ సమర్ధించుకోవటమే చాలా విచిత్రంగా ఉంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ? ఏమి యాక్షన్ తీసుకుంటుందో చూడాల్సిందే.

Read More
Next Story