కవితని కలిసిన కేటీఆర్.. ఏం చర్చించినట్టు?
x

కవితని కలిసిన కేటీఆర్.. ఏం చర్చించినట్టు?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితని ఒకసారి కలిసిన ఆయన ఇప్పుడు సిబిఐ కస్టడీలో ఉండగా కవిత భర్త అనిల్, ఆమె న్యాయవాది మోహిత్ తో కలిసి ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో కలిశారు.

కవితకి ధైర్యం చెప్పి, లిక్కర్ కేసులో చేయాల్సిన పోరాటంపై చర్చించారు. సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఆమెకి గంటసేపు కుటుంబసభ్యుల్ని కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కస్టడీలో ఉన్న కవితని కలిసేందుకు కేటీఆర్ వెళ్లారు. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగి ఉండొచ్చు అనే విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాగా, కవిత సిబిఐ కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో రేపు ఉదయం అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు కావేరి బజాజా ముందు ప్రవేశపెట్టనున్నారు. గురువారం తీహార్ జైలులో ఉన్న కవితని సిబిఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఆమెని కోర్టులో హాజరుపరిచి, 5 రోజులపాటు సిబిఐ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా... న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగింపు కోసం సిబిఐ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, చిన్న కొడుకుకి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఈ నెల నాలుగున కవిత న్యాయస్థానాన్ని కోరారు. కానీ ఆమె బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్ష్యుల్ని బెదిరించే ప్రమాదం ఉందని ఈడీ బలంగా వాదించటంతో కోర్టు ఆమెకి మధ్యంతర బెయిల్ నిరాకరించింది. మరోవైపు ఈడీ కేసులో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల పదహారున విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో కవితని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీలో విచారించగా.. అనంతరం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైలులో ఉన్న ఆమెని ఈ నెల 11 న సిబిఐ అధికారులు అరెస్టు చేయగా, కోర్టులో విచారణ అనంతరం ఆమె మూడు రోజుల సిబిఐ కస్టడీలో కొనసాగుతున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టై తిహార్ జైలులో ఉన్న విషయం విధితమే.

Read More
Next Story