KTR | పట్నం నరేందర్ అరెస్ట్ రేవంత్ కక్ష పూరిత చర్యా?
x

KTR | పట్నం నరేందర్ అరెస్ట్ రేవంత్ కక్ష పూరిత చర్యా?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.


తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన ఆరోపణలు చేశారు. అందుకు తమ పార్టీ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) అరెస్ట్ నిలువెత్తు నిదర్శమని చెప్పారు. రేవంత్ ప్రతీకార రాజకీయాల వల్లే పట్నం నరేందర్.. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. లగచర్ల(Lagacharla)లో అధికారులపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు.. పట్నం నరేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలు(Cherlapally Jail)లో ఉన్నారు. కాగా శనివారం రోజున పలువురు నేతలతో కలిసి రేవంత్ రెడ్డి.. చర్లపల్లి జైలుకు వెళ్లారు. అక్కడ పట్నం నరేందర్‌ను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పోరాటం బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని, ఇటువంటి అరెస్ట్‌లు తమను భయపెట్టలేవని ఆయన తెలిపారు. కొడంగల్‌లో దళిత, గిరిజన, బహుజన భూములు లాక్కును అవసరం లేని ఫార్మా విలేజ్‌ను ప్రజలపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు కూడా తప్పు చేయని అమాయకులు చాలా మంది శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు మాత్రం గద్దెనెక్కి కూర్చున్నారని విమర్శలు చేశారు. కొడంగల్‌లో అర్ధరాత్రి సమయంలో ఇళ్లపై పడి మహిళల, చిన్నారులపై అరాచకాలు చేస్తున్నారని, పేద రైతుల భూములను గుంజుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

ఏంటీ దారుణాలు..

‘‘సీఎం సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో 85ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై మాజీ సర్పంచ్ పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం మొన్నటి ఎన్నికల్లో కూడా సాయిరెడ్డి పనిచేశారు. కానీ అతని ఇంటికి అడ్డుగా గోడ కట్టి బయటకు పోయే తోవ లేకుండా చేశారు. ఆ అవమానం, క్షోభ తట్టుకోలేక సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎప్పుడైనా ఇటువంటి ఘటనలు జరిగాయా? మీరు చూశారా? కనీసం విన్నామా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. సొంత ఊరు, నియోజకవర్గం అయితే నువ్వు చక్రవర్తిసా, నీ సామ్రాజ్యమా? వెయ్య ఏళ్లు బతకడానికి వచ్చావా? సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జాన్యాలు, గిరిజన రైతుల కుటుంబాలపై అర్దరాత్రిళ్లు బందిపోట్ల తరహాలో పోలీసులు దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోకూడదని హితవు పలికారు.

పాపాలు పండే రోజులు దగ్గర్లోనే..

‘‘సొంత ఊర్లో చేస్తున్న అరాచకాలు, పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. నీకన్నా పెద్దపెద్ద నియంతలే కొట్టుకుపోయారు. మా నేత నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు. ఇప్పటికి కూడా పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. బీఆర్ఎస్ నేతలకు పోరాటం కొత్తేమీ కాదు. మహబూబాబాద్‌లో చేపట్టనున్న ధర్నాను విజయంవంతం చేయాలని మాలో ఉత్సాహాన్ని నింపారు. జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం. మీరు భయపడొద్దు. మీ వెనక కేసీఆర్ ఉన్నారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టొచ్చు. కానీ అతనికి రాజకీయ జీవితం లేకుండా చేసే సత్తా మీకుంది. ఆ బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది’’ అని కేటీఆర్ వివరించారు.

Read More
Next Story