మరోసారి హైకోర్టుకు వెళ్లిన కేటీఆర్
x

మరోసారి హైకోర్టుకు వెళ్లిన కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం రోజురోజుకు కీలకంగా మారుతోంది. ఇందులో ఎప్పుడు ఎలాంటి కోణాలు బయటకు వస్తాయో ఊహకు కూడా అందడం లేదు.


ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం రోజురోజుకు కీలకంగా మారుతోంది. ఇందులో ఎప్పుడు ఎలాంటి కోణాలు బయటకు వస్తాయో ఊహకు కూడా అందడం లేదు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సహా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ, ఈడీలు బుధవారం విచారిస్తున్నాయి. గురువారం కేటీఆర్‌ను ఏసీబీ విచారించనుంది. ఈ క్రమంలోనే బుధవారం.. కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తనపై నమోదు చేసిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసును కొట్టివేయాలని, తనను అరెస్ట చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం న్యాయస్థానం కొట్టివేసింది. పోలీసుల విచారణలో అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రమే తాము ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసే అధికారాన్ని వినియోగిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఏసీబీ విచారణకు తనతోపాటు తన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు మాజీ మంత్రి. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన క్రమంలనే కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.

వాస్తవానికి జనవరి 6న కేటీఆర్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసుల మేరకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. తన న్యాయవాదులను అనుమతించకపోవడం అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం తన సమాధానాన్ని రోడ్డుపైనే లిఖిత పూర్వకంగా అధికారులకు అందించారు. దీంతో అదే రోజు సాయంత్రం కేటీఆర్ నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు తనిఖీల అనంతరం ఫ్రెస్ నోటీసులను జారీ చేశారు. అందులో జనవరి 9న విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.

Read More
Next Story