‘తెలంగాణ ఉద్యమంలో సురవరం పాత్ర మరువలేనిది’
x

‘తెలంగాణ ఉద్యమంలో సురవరం పాత్ర మరువలేనిది’

మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి కేటీఆర్ నివాళులు.


సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం పూడ్చలేని లోటన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తి అని, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంతో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో మరెందరో తెలంగాణ ఉద్యమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారని గుర్తు చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థీవదేహానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సురవరం వ్యక్తిత్వం, సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సురవరం అని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతులో సురవరం పాత్ర మరువలేనిదని అన్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు.

‘‘సురవరం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ నాయకుడిగా ఎదిగారు. జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఏడు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. అది సామాన్యవిషయం కాదు. సామాన్యుని నుంచి అసాధారణ నేతగా ఎదిగిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి. ప్రజల సమస్యల పట్ల ఆయన నిబద్ధత అజరామరం. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు. అటువంటి సురవరం మన మధ్య లేకపోవడం ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతిఒక్కరికి తీరని లోటు. తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతులో ఆయన పాత్ర మరువలేనిది. జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతు కూడగట్టడంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం బీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కింది. కేసీఆర్‌ వారితో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు.వారి తరపున సువరం సుధాకర్‌ రెడ్డికి నివాళులర్పిస్తున్నాం. వారి కుటుంబసభ్యులకు, కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడి తరపున, తమ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఆయన మరణం బాధాకరం: గుత్తా సుఖేందర్

సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు. రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. పార్టీని, భావజాలాన్ని ఎన్నడూ వీడని వ్యక్తి సురవరం అని తెలిపారు. సురవరం భౌతిక కాయానికి కోదండరామ్‌, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జయప్రకాష్‌ నారాయణ నివాళులర్పించారు.

మఖ్దూం భవన్ వద్ద సురవరం పార్థీవదేహం..

సురవరం సుధాకర్ రెడ్డి పార్థీవదేహాన్ని మఖ్దూం భవన్ వద్ద ఉంచారు. నేతలు, అభిమానులు, అనుచరుల సందర్శనార్థం ఆదివారం సాయంత్రం వరకు ఆయన పార్థీవ దేహాన్ని అక్కడ ఉంచనున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు సురవరంకు నివాళులు అర్పిస్తున్నారు.

Read More
Next Story