‘సింగిల్ సీటు కోసం సీఎం వచ్చాడంటే వాళ్లలో భయం తెలిసిపోతుంది’
x

‘సింగిల్ సీటు కోసం సీఎం వచ్చాడంటే వాళ్లలో భయం తెలిసిపోతుంది’

బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఈ సర్కార్‌ పాలనలో హారతి కర్పూరాలుతున్నాయన్న కేటీఆర్.


రెండేళ్ల కిందట మాయమాటలకు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేసినందకు ఇప్పటికీ అవస్థలు పడుతున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈసారైనా అన్ని ముందూ వెనక ఆలోచించుకుని ఓటర్లు ఓటు వేయాలని ఆయన కోరారు. మళ్ళీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవస్థలు ఇంకా అధికమవుతాయని, తామేం చేయకపోయినా ఓట్లు వేశారు కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటారని అన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఆఖరి రోజు ప్రచారంలో భాగంగా యూసఫ్‌గుడాలో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు కేటీఆర్. కత్తి తమ చేతికి ఇస్తే కాంగ్రెస్ బుల్డోజర్లను ఆపే బాధ్యత తమదని అన్నారు.

‘‘ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వేయండి. కేసీఆర్ అంద‌రినీ క‌డుపులో పెట్టుకొని చూసుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకున్నాం. బ‌స్తీ ద‌వాఖానా, 20 వేల లీట‌ర్ల ఉచిత నీళ్లు, క‌రెంటు క‌ష్టాలు లేకుండా చేసుకున్నాం. వెంగ‌ళ్‌రావు న‌గ‌ర్‌లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మించుకున్నాం. హైద‌రాబాద్‌లో 42 ఫ్లై ఓవ‌ర్లు, కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి స‌మ ప్రాధాన్య‌త ఇచ్చాం. ల‌క్ష‌లకొద్దీ ఐటీ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. కొంచెం క‌ష్ట‌మైనా కుటుంబం బాగుండాల‌ని పేద‌లు ప్లాట్లు కొన్నారు. కానీ.. ఆ ప్లాట్ల ధ‌ర‌లు ఇప్పుడు ఎలా ఉన్నాయో అంద‌రూ ఆలోచించాలి’’ అని కోరారు.

‘‘మ‌నం పెట్టిన పెట్టుబ‌డులు హ‌ర‌తి క‌ర్పూరంలా క‌రిగిపోతున్నాయి. ఎన్ని అబ‌ద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందో గుర్తు తెచ్చుకోవాలి. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అంద‌రినీ మోసం చేసింది. తులం బంగారం ఇస్తామ‌న్నారు.. ఎవ‌రికైనా ఇచ్చారా? ఆడ‌బిడ్డ‌ల‌కు రూ.2500, వృద్ధుల‌కు రూ.4 వేలు పెన్ష‌న్ ఇస్తామ‌న్నారు.. ఇచ్చారా? ఈ రెండేళ్ల‌లో ఒక్క మాట కూడా నిల‌బెట్టుకోని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తానంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఇందిర‌మ్మ ఇల్లు ఇస్తామ‌ని చెప్పి ఇల్లు కూల‌గొడుతున్నారు. శ‌నివారం, ఆదివారం వ‌చ్చిందంటే పేద‌ల ఇళ్ల‌పైకి బుల్డోజ‌ర్ వ‌స్తోంది. రెండేళ్ల‌లో వేల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేశారు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘ఇందిర‌మ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కూల‌గొట్టే వాళ్ల‌కు ఎవ‌రైనా ఓటు వేస్తారా? క‌త్తి కాంగ్రెస్‌కు ఇచ్చి యుద్ధం మ‌మ్మ‌ల్ని చేయ‌మంటే ఎలా చేయాలి. క‌త్తి మాకు ఇవ్వండి బుల్డోజ‌ర్‌కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్య‌త మాది. బుల్డోజ‌ర్‌ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. మాగంటి సునీత‌మ్మ‌ను గెలిపించుకుంటే.. మ‌ళ్లీ కేసీఆర్ వ‌స్తారు. 500 రోజుల్లో కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందాం. జూబ్లీహిల్స్‌లో దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తే.. రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటడో.. మూడు నెల‌లు ఉంట‌డో తేలిపోతుంది. ఢిల్లీలో రేవంత్‌పై క‌త్తులు నూరుతున్నారంటా.. కొంద‌రు నేత‌లు సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి తీయ‌ని మాట‌లు చెప్తారు.. ఆ త‌ర్వాత పైస‌లు లేవ‌ని చేతులెత్తేస్తారు’’ అని చురకలంటించారు.

‘‘ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌ను చూశాం.. ఏ ఒక్క ముఖ్య‌మంత్రి రేవంత్ త‌ర‌హాలో చిల్ల‌ర‌గా మాట్లాడ‌లేదు. పెన్ష‌న్ అడిగితే గుడ్లు పీకుతామంటారు.. తులం బంగారం అడిగితే పేగులు పీకి మెడ‌లో వేసుకుంటా అంటారు. గెలిచిన ఎమ్మెల్యేల‌కే రేవంత్ రెడ్డి ఏమీ ఇవ్వ‌ట్లేదు మాకే దిక్కులేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పెళ్లిల్లు, పేరంటాల‌కు వెళ్ల‌డం త‌ప్ప ప‌నులు చేయ‌డానికి డ‌బ్బులు లేవ‌ని యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి చెప్పారు. మ‌రో ఎమ్మెల్యే డ‌బ్బులు కావాలంటూ వ‌ర‌ల్డ్ బ్యాంక్‌కు లెట‌ర్ రాశారు. అమ్మ‌కు అన్నం పెట్ట‌డు.. చిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తడా? ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన వ్య‌క్తి జూబ్లీహిల్స్‌కు న్యాయం చేస్త‌రా?’’ అని ప్రశ్నించారు.

‘‘ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌కుండా విద్యార్థుల‌ను ఇబ్బంది పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి అడిగిన కాలేజీ యాజ‌మాన్యాల‌ను బెదిరిస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు బ‌కాయిలు చెల్లించ‌కుండా ఇబ్బందులు పెడుతున్నారు. 4 ల‌క్ష‌ల మంది జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు 4 కోట్ల మందికి న్యాయం చేసే అవ‌కాశం ద‌క్కింది. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు తెలియ‌గానే అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ముందు సినిమా వాళ్ల‌ను జైల్లో పెడ‌తారు.. ఎన్నిక‌లు వ‌స్తే బ‌ల‌వంతంగా సినిమా వాళ్ల‌తో స‌న్మానం చేయించుకుంటారు. యూసఫ్‌గూడ‌లో సినీ కార్మికుల‌ను కాపాడుకునే బాధ్య‌త మాది. పోలీస‌న్న‌ల‌కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. ఎన్నిక‌ల త‌ర్వాత మిమ్మ‌ల్ని కూడా ఇబ్బంది పెట్టారు’’ అని గుర్తు చేశారు.

‘‘పోలీస్ కుటుంబాల‌నే కొట్టించిన వ్య‌క్తి రేవంత్ రెడ్డి.. ఇలాంటి మ‌నిషిని ఎవ‌రైనా న‌మ్ముతారా? మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌స్తేనే పోలీసుల‌కు కూడా న్యాయం జ‌రుగుతుంది. ఓటు వేయ‌క‌పోతే ప‌థ‌కాలు ఆపుతామ‌ని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు.. ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని ప‌థ‌కాలు ఆపుతాడు. బజార్ల‌కు గుంజి ప‌థ‌కాల గురించి గ‌ల్లా ప‌ట్టి నిల‌దీస్తాం. కొంద‌రు ఆకు రౌడీలు బెదిరిస్తున్నారు.. వాళ్ల సంగ‌తి తేలుస్తాం. గెల‌వ‌క‌ముందే ఇన్ని బెదిరింపుల‌కు దిగుతున్నారు.. గెలిపిస్తే ఊరుకుంటారా? ఆడ‌బిడ్డ అని చూడ‌కుండా సునీత‌మ్మ‌పై కూడా కుట్ర‌లు చేస్తున్నారు. ఓడిపోతామ‌ని తెలిసి ఓటు కోసం డ‌బ్బులు పంచుతున్నారు’’ అని అన్నారు.

‘‘రేవంత్ రెడ్డి పంచాలంటూ డ‌బ్బులు పంపిస్తే.. అందులో కూడా కాంగ్రెస్ నాయ‌కులు క‌మీష‌న్ల తీసుకుంటున్నారంటా. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే రూ.2500 ఆడబిడ్డ‌ల‌కు ఇస్తారు.. రూ.4 వేలు పెన్ష‌న్ ఇస్తారు.. వికలాంగుల‌కు రూ.6 వేలు ఇస్తారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే నేనేం చేయ‌క‌పోయినా.. నాకే ఓటేశారంటే.. ప‌థ‌కాలు అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని అంటారు. ఒక్క సీటు కోసం సీఎం కూడా ప్ర‌చారం చేస్తున్నారంటే వాళ్లు ఎంత భ‌య‌ప‌డుతున్నారో అర్ధం అవుతుంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బ‌కు రేవంత్ కుర్చీ ఉంట‌దో.. ఊడుతుందో చూసుకోవాలి. రెండేళ్ల క్రితం మోసం పోయాం.. ఇప్ప‌టికీ అవ‌స్థ‌లు ప‌డుతున్నాం.. మ‌ళ్లీ మోస‌పోవ‌ద్దు. కాంగ్రెస్ వాళ్లు కుక్క‌ర్లు, చీర‌లు పంచుతున్నారంటా.. నిజంగానే మంచి చేస్తే ఇవ‌న్నీ చేయాల్సిన అవ‌స‌రం లేదు క‌దా?’’ అని అన్నారు.

Read More
Next Story