‘శృతి మించుతున్న కాంగ్రెస్ గూండాగిరి’
x

‘శృతి మించుతున్న కాంగ్రెస్ గూండాగిరి’

అధికారం ఉందని హత్యాయత్నాలకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించిన కేటీఆర్.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, కాంగ్రెస్ నేతల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అమానుష ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బిట్ల బాలరాజు, ఫలితాల తర్వాత తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్న సమయంలో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, స్థానిక మండల అధ్యక్షుడు సాయిబాబా ట్రాక్టర్‌తో అక్కడకు వచ్చి బీభత్సం సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.

“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, నన్నెవరూ ఏం చేయలేరు” అంటూ విర్రవీగుతూ నిల్చున్న వారిపైకి ట్రాక్టర్ ఎక్కించి ఢీకొట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ దాడిలో బాలరాజుతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేటీఆర్ వెంటనే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి, పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కేటీఆర్ కామారెడ్డి జిల్లా ఎస్పీతోనూ ఫోన్‌లో మాట్లాడారు. సోమార్‌పేట్ ఘటనను వివరించి, దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. “అధికారం ఉందని హత్యాయత్నాలకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా?” అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని, పార్టీ తిరగబడితే శాంతిభద్రతలు అదుపులో ఉండవని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. గాడి తప్పిన కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన తేల్చిచెప్పారు.

Read More
Next Story