KTR | ‘బీసీ రిజర్వేషన్లపై బిల్లు పెడతారని ఆశించాం’
x

KTR | ‘బీసీ రిజర్వేషన్లపై బిల్లు పెడతారని ఆశించాం’

సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సమయంలో తమరిచ్చిన ప్రసంగం యూట్యూబ్‌లో దొరుకుతుంది రేవంత్.


తెలంగాణ అసెంబ్లీ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల గణన నివేదికపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలోనీ బీసీలను కాంగ్రెస ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. బీసీలు ఎంత మంది ఉన్నారన్న విషయం చెప్పడానికి ప్రత్యేక సమావేశం పెట్టాలా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేసన్‌కు సంబంధించి బిల్లు ప్రవేశపెడతారని ప్రజలంతా ఆశించారని, కానీ వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చిలకరించిందని మండిపడ్డారు. బిల్లు ప్రవేశపెడతారని భావిస్తే చివరకు ఏదో రిపోర్ట్ ఒకటి ప్రవేశపెట్టి సమావేశాన్ని మమ అనిపించేశారని చురకలంటించారు.

‘‘సీఎం చారిత్రాత్మకమైన ప్రత్యేక సమావేశంలో కామారెడ్డి డిక్లరేషన్ తరహాలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెడతారేమోనని బలహీన వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ సీఎం మాత్రం లేచి నాలుగు పేర్లు చదువుతున్నారు. మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా ఇలా మోసం చేస్తూ పొగొట్టుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సమయంలో తమరిచ్చిన ప్రసంగం యూట్యూబ్‌లో దొరుకుతుంది. ఆ రోజున మీరు ఏమన్నారు? ఆ ముఖ్యమంత్రి సర్వే పెడితే ఎవరు పడితే వాళ్లు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా? అని మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మీరు చెప్పిన మాటలనే ప్రజలు కూడా ఎన్యుమరేటర్లకు చూపి ప్రశ్నించారు. 57 రకాల వివరాలు అడుగుతున్నారు.. ఎలా ఇస్తాం? అని మరే అన్నారు. ఎవరు పడితే వారికి ఇచ్చేస్తామా? అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి, రామకృష్ణారావు, సందీప్‌కుమార్ సుల్తానియా ఉన్నారు. అప్పుడు కూడా ఈ అధికారులే ఉన్నారు. వేరే వారు ఎవరో లేరు. నేను మీలా నోటికొచ్చింది మాట్లాడట్లేదు. రికార్డు ప్రకారమే మాట్లాడుతున్నాను. సమగ్ర కుటుంబ సర్వేను చేయించిందీ ప్రభుత్వమే. చేసిందీ ప్రభుత్వ అధికారులే. అది కచ్ఛితంగా అధికారిక డాక్యుమెంట్. అందులో వివరాలను వెబ్‌సైట్‌లోనే పెట్టాం’’ అని అన్నారు కేటీఆర్.

సమగ్ర సర్వేలో బీసీల సంఖ్య ఉంది..

‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను అసెంబ్లీలోనే.. చాటుమాటుగానో ప్రవేశపెట్టలేదు. పబ్లిక్ డొమైన్‌లో ఉంచాం. ఆ సర్వే వివరాలనే బీజేపీ నేత పాయల్ శంకర్ తీసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఏం ఉంది. కేసీఆర్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే.. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటంబాల సంఖ్య 1,03,95వేలు. ప్రజల సంఖ్య 3.68కోట్లు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటినీ ఎన్యూమరేట్ చేశాం. ఇప్పుడు సీఎం రేవంత్.. అప్పటి ప్రభుత్వం చేసిన సర్వేను ఎంతలా తప్పుదోవపట్టిస్తున్నారంటే.. మా ప్రభుత్వం చేసిన పని గురించి అనుమానాలు తలెత్తేలా విధంగా ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన, వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వేలో ఉంది ఎంత? అని అడుగుతున్నారు. ఆనాడు చేసిన సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1,85,61,856. అంటే రాష్ట్ర జనాభాలో 51శాతం బీసీలు ఉన్నారు. అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను 10శాతం కలుపుకుంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61శాతం బీసీలు ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీనివాస్ యాదవ్‌ సరిగ్గా చెప్పారు’’ అని కేటీఆర్ వెల్లడించారు.

నివేదిక తప్పని మీ ఎమ్మెల్సీనే చెప్తుండు..

‘‘ఈ నివేదిక అంతా తప్పుల తడగ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు. ఈ సర్వేను తగలబెట్టాలని కూడా అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85 కోట్లు ఉన్న బీసీలు ఇప్పుడు 1.64లక్షలకు ఎలా తగ్గుతారు. 51శాతం ఉన్న బీసీలు ఇప్పుడు 46శాతానికి ఎలా తగ్గారు. శంకర్ అన్న కూడా అదే అడిగారు. అందులో తప్పేంటి. ఆయనే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా అదే అడుగుతున్నాడు. మీరిచ్చిన నివేదికను తగలబెట్టాలని కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా పెట్టారు కానీ.. ఇందులో సీఎం కొత్తగా ఏం చెప్పారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిందే చెప్పారు. అలాంటప్పుడు ఇవాళ సభ ఎందుకు పెట్టినట్లు? 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు పెడతారని అనుకున్నాం. మీరు చెప్పినట్లు బీసీలు 56శాతం ఉంటే.. వారికి బీసీ సబ్ ప్లాన్ తెస్తారేమోనని అనుకున్నాం. ఎటువంటి బిల్లు తీసుకురాకుండా సభలో కేవలం నివేదికను మాత్రమే ప్రవేశపెట్టారు. పైగా ఇది చారిత్రాత్మకమని చెప్పుకుంటున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి.

Read More
Next Story