
‘రంకెలు వేయడం కాదు రేవంత్.. అంకెలు ఆగమెలా అయినాయో చెప్పు’
2025 - 2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇది దగా బడ్జెట్ అన్నారు. కాంగ్రెస్ తమ కమిషన్‌లు పెంచుకోవడానికి సిద్ధం చేసుకున్న బడ్జెట్‌లా ఉందన్నారు. ఆరు గ్యారెంటీలను పాతరేశారని అన్నారు. అంతేకాకుండా తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు.. ఊసరవెల్లి ముందిరితే రేవంత్ రెడ్డి అవుతారంటూ చురకలంటించారు కేటీఆర్. 2025 - 2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం అని చురకలంటించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ దగ్గర బడ్జెట్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.
‘‘రంకెలు కాదు రేవంత్ రెడ్డి - అంకెలు ఎక్కడ పోయినై. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్. ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలు గోవిందా, పాతర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావించలేదు. ఈ ప్రభుత్వానికి 40 శాతం సమయం ఈ బడ్జెట్ తో సమసి పోయింది. తుల బంగారం దిక్కు లేదు. చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే. ఇవ్వాల చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. దళిత సోదరులను మోసం చేశారు. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఉద్యోగాలు ఇచ్చింది కెసిఆర్ , కాగితాలు ఇచ్చింది ఈ సన్యాసి ప్రభుత్వం. నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా గురించి ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేక మేడలా కుప్ప కూల్చారు. ట్రిలియన్ డాలర్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని దరిద్రపు ప్రభుత్వం. కరోనా కంటే డేంజర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్’’ అని మండిపడ్డారు.
ఈ బడ్జెట్లో 420 హామీలు గురించి కూడా ప్రస్తావించలేదు. ఆరు గ్యారెంటీలు, నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి.. ఇవి భగవద్గీతతో సమానం అని అబద్దాలతో ఓట్లు వేయించుకుని వాటికి ఇవాళ పాతరేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. తులం బంగారం దిక్కు లేదు.. మహాలక్ష్మికి దిక్కు లేదు. పెన్షన్లకు పాతరేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ రూ. 1200 కోట్ల బడ్జెట్ పెడితే.. ఇవాళ రూ. 370 కోట్లకే పరిమితమైపోయింది. ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆర్హత్య చేసుకున్నారు. వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి అతిగతి లేదు. వారి గురించి ఒక్క మాట లేదు. స్విగ్గీ, జొమాటో, ఇతర యాప్స్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్కు గిగ్ వర్కర్స్ బోర్డు పెడుతామని చెప్పి మోసం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసి 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. వారికి ఇంకా ఎక్కువ మేలు, న్యాయం చేస్తామన్నారు. వారి గురించి ఒక్క మాట కూడా బడ్జెట్లో చెప్పలేదు. పీఆర్సీ, డీఏల గురించి స్రస్తావించలేదు. ఆడబిడ్డలకు తీరని తీవ్రమైన అన్యాయం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలని రాహుల్ నరికిండు. ఇవాళ నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే.. కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేస్తున్నా.. దరమ్ముంటే రా రాహుల్ గాంధీ.. అశోక్ నగర్కు రా.. చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. నిరుద్యోగ భృతి, యువ వికాసం అన్నారు. వీటి గురించి ఒక్క మాట లేదు. విద్యాభరోసా కార్డు గురించి ప్రస్తావన లేదు. ఉన్న గురుకులాలను నిర్వహించలేని అసమర్థలు వీరు.. 80 మందికి పైచిలుకు పిల్లలు చనిపోతే నివారించలేని వారు.. కొత్త స్కూల్స్ కడుతామని బిల్డప్స్ ఇస్తున్నారు.. సిగ్గు పడాలని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.