వారం రోజుల్లో కవితకి బెయిల్
x

వారం రోజుల్లో కవితకి బెయిల్

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.


ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వారం రోజుల్లో ఆమెకి బెయిల్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న తన చెల్లెలి గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేటీఆర్, హరీష్ రావులు తీహార్ జైలుకి వెళ్లి కవితని కలిసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తన చెల్లెలు జైల్లో చాలా ఇబ్బంది పడుతోందని చెప్పారు. ఇప్పటివరకు 11 కిలోల బరువు తగ్గిందని,బీపీ కూడా వచ్చిందని చెప్పారు. అనారోగ్యం కారణంగా ఆమె రోజూ రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోందని తెలిపారు.

దేశంలో రాజకీయంగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నారు. గురువారం బెయిల్ కోసం అప్పీల్ చేశామని కేటీఆర్ చెప్పారు. వచ్చే వారంలో బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు . మనీష్ సిసోడియాకి వచ్చింది కాబట్టి మిగిలినవారికి రావచ్చని అభిప్రాయపడ్డారు. జైల్లో 11 వేల ఖైదీలు ఉండాల్సిన చోట 30 వేలమంది ఖైదీలను ఉంచారని తెలిపారు. జైలు పరిసరాలు పరిశుభ్రంగా లేవని చెప్పారు కేటీఆర్. అయితే జైలుకి వెళ్లి వచ్చినవాళ్లు గొప్ప లీడర్లు అవుతారని ప్రచారంలో ఉంది కాబట్టి తన సోదరి కవిత కూడా భవిష్యత్తులో పెద్ద లీడర్ అవుతుందని చెప్పుకొచ్చారు.

మనీష్ సిసోడియాకి బెయిల్...

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ పాలసీ స్కాం కేసులో సిసోడియా గత 17 నెలల నుంచి జైలులో ఉన్నారు. విచారణ పేరుతో నిందితుడిని ఇంతకాలం జైలులో ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కు స్వేచ్ఛను హరించడమేనని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేర్వేరుగా అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో సుప్రీం కోర్టు సిసోడియాకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తన పాస్‌పోర్ట్‌ ను ప్రత్యేక ట్రయల్ కోర్టుకు సరెండర్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని, ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 నుంచి11 గంటల మధ్య విచారణ అధికారి ముందు హాజరు కావాలని సూచించింది.


Read More
Next Story