త్వరలో సీఎం రేవంత్‌పై కేసు.. ముందే చెప్పిన కేటీఆర్
x

త్వరలో సీఎం రేవంత్‌పై కేసు.. ముందే చెప్పిన కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్.. సమంతను రమ్మన్నారంటూ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై కేటీఆర్ స్పందించారు.


మాజీ మంత్రి కేటీఆర్.. సమంతను రమ్మన్నారంటూ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై సినిమా ఇండస్ట్రీ అంతా మండిపడింది. రాజకీయ పెద్దలు, ప్రముఖులు కూడా ఈ విషయంలో మంత్రి కొండా సురేఖనే తప్పుబట్టారు. తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్లు వెల్లడించారు. తనపై చేస్తున్న ఈ గబ్బు ప్రచారాన్ని సహించనని, ఈ గబ్బు మాటలకు ఘాటుగా బదులిస్తానంటూ హెచ్చరించారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టమని, దీని వెనక ఎవరున్నారో కూడా తమకు బాగా తెలుసంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి కొండా సురేఖ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున కూడా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా న్యాయపరంగా మంత్రికి సరైన సమాధానం చెప్తానని అంటున్నారు.

సీఎం రేవంత్ ఎంత..

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంతా అనంటున్నారు. ఇదే విధంగా నాపై అత్యంత దారుణమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అతి త్వరలోనే దీని వెనక ఉన్న సీఎం రేవంత్‌పై కూడా దావా వేస్తా. ప్రధాని మోదీకే దడవలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అతి త్వరలోనే పరువు నష్టం కేసు నమోదుకానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు కేటీఆర్ఎస్ ఎప్పుడు పెడతారో చూడాలి. ఇదిలా ఉంటే కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున.. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. నాగచైతన్య, అక్కినేని అఖిల్ సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఇంతకీ వారేమన్నారంటే..

క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నాగ్

‘‘సదరు మంత్రి తన వ్యాఖ్యలతో మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు. నా కుమారుడు నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ తమతమ జీవితాలను గౌరవంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన రాజకీయాల కోసం వీరి విడాకుల అంశాన్ని పావుగా వినియోగించుకోవడం ఏమాత్రం సబబు కాదు. దశాబ్దాలు సినీ పరిశ్రమలో కానీ, ప్రజల్లో కానీ కాపాడుకుంటూ వస్తున్న మా కుటుంబ గౌరవాన్ని సైతం సదరు మంత్రి తన వ్యాఖ్యలతో దెబ్బతీశారు. ఆమె వ్యాక్యలతో మా కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అవన్నీ అబద్ధాలే..: నాగచైతన్య

కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగచైతన్య తోసిపుచ్చారు. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ‘‘జీవితంలో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని. బాధాకరమైనది కూడా. చాలా ఆలోచించిన తర్వాతే నేను, నా మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకరాంతోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు. సమాజంలో మహిళలకు గౌరవం, మద్దతు దక్కాలి’’ అని నాగచైతన్య తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు కొండా సురేఖ మంత్రి కాకపోయినా.. సాటి మహిళగా అయినా ఆమె ఆలోచించి ఉండాల్సిందని, విడాకులు అనేవి ఒక మహిళ జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో ఊహించి ఉండాల్సింది అని కూడా నాగచైతన్య హితవు పలికారు.

బుద్ధి చెప్పాల్సిందే: అఖిల్

అర్థంపర్థం లేని విషయంపై స్పందించాల్సి రావడం చాలా బాధాకరమని, కానీ కొన్నికొన్ని సార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్పనిసరి అని అఖిల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ‘‘కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్దంగా, అతి జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు. ఆమె మాటలు మా కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశాయి. ఆమె తన స్వార్థ రాజకీయాల కోసం ఎటువంటి సంబంధం లేని మా కుటుంబాన్ని లాగడం సహించదగినది కాదు. ఆమె తన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలిపశువులను చేశారు. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి న్యాయపరంగా బుద్ధి చెప్పి తీరాలి. ఇలాంటి వాళ్లకు సమాజాంలో ఉండే అర్హత లేదు. ఆమెను ఎట్టిపరిస్థితుల్లో క్షమించకూడదు’’ అంటూ అఖిల్ మండిపడ్డారు.

Read More
Next Story