
KTR |‘కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి’
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయిన విషయం తెలిసిందే
ఎడతెరిపిలేని భారీవర్షాల కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీశ్రేణులకు పిలుపిచ్చారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్సు(Teleconference)లో మాట్లాడారు. భారీవర్షల(Telangana heavy Rains) కారణంగా అవస్తలు పడుతున్న ప్రజలను ఆదుకోవటం మనకర్తవ్యంగా భావించాలని నేతలు, క్యాడర్ కు సూచించారు. భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయిన విషయం తెలిసిందే. ఇళ్ళల్లోకి నీళ్ళొచ్చేసి వేలాదిమంది అల్లాడిపోతున్నారు.భారీవర్షాల కారణంగా బయటకు వచ్చే అవకాశంలేక, వర్షపు నీరు ఇంట్లోకి వచ్చేస్తున్న కారణంగా ఇంట్లోనూ ఉండలేక జనాలు నానా అవస్తలు పడుతున్నారు.
విపత్కర పరిస్ధితుల్లో చిక్కుకున్న జనాలందరికీ పార్టీ అండగా నిలవాలని కేటీఆర్ చెప్పారు. నేతలు, క్యాడర్లో ఎవరికి వీలైనంతగా వాళ్ళు సాయంచేయాలని చెప్పారు. బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వంతో సంబంధంలేకుండానే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. మంచినీరు, పాలు, ఆహారం, మందులు, బట్టల్లాంటి కనీస సౌకర్యాలను కలిగించాలని కేటీఆర్ నేతలకు విజ్ఞప్తిచేశారు. అవసరమైన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయమని సూచించారు. సహాయక చర్యల్లో స్ధానిక ప్రభుత్వ సిబ్బందితో పార్టీ నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే మూడురోజులూ జనాలందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసరమైతే తప్ప జనాలెవరూ బయటకు రావద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో పార్టీ నేతలు, క్యాడర్ ప్రభుత్వ యంత్రానికి సాయంచేయాలన్నారు.