‘అయినను పోయిరావలే హస్తినకు’.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
x

‘అయినను పోయిరావలే హస్తినకు’.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ టూర్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ టూర్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. పని ఏమీ లేకపోయినా ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నట్లు సీఎం తీరు తయారైందని విమర్శించారు కేటీఆర్. సీఎం టూర్ల వల్ల రాష్ట్రానికి దమ్మిడీ ఆదాయం లేదని, పైగా ఆయన టూర్లకు అయ్యే ఖర్చు నష్టం అన్న తరహాలో ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన మాటలకు కొన్ని వర్గాలు కూడా వంతపాడుతున్నాయి. రేవంత్ రెడ్డి పేరుకే తెలంగాణ సీఎం అని, ఆయన ఎక్కువ కాలం ఢిల్లీకి వెళ్లిరావడానికే వెచ్చిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అసలు రేవంత్ అన్ని సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నట్లో? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు.

కేటీఆర్ ఏమన్నారంటే..

పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేదు.. అయినను పోయిరావలె హస్తినకు అన్న రీతిలో సీఎం రేవంత్ తీరు ఉందంటూ విసుర్లు విసిరారు కేటీఆర్. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో సీఎం రేవంత్ సిల్వర్ జూబ్లీ కూడా చేశారంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాలుగా మారిన గురుకులాలు, కుంటుపడిన వైద్యం, గాడి తప్పిన విద్యావ్యవస్థ, మూసీ, హైడ్రా అంటూ పేదోళ్ల నెత్తిన నీడ లేకుండా పోతున్నా పట్టించుకోకుండా ఈ సీఎం ఢిల్లీకి వెళ్లడమే పరమావధిగా పెట్టుకున్నారని మండిపడ్డారు కేటీఆర్. ప్రజల సమస్యలు పట్టవుకాని.. ఢిల్లీ పెద్దల వెళ్లడానికి మాత్రం ముందుంటారంటూ ఎద్దేవా చేశారు.

అయినను పోయిరావలె హస్తినకు..

‘‘పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు

10 నెలలు - 25 సార్లు - 50రోజులు

పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు

అయినను పోయి రావాలె హస్తినకు

అన్నదాతల అరిగోసలు

గాల్లో దీపాల్లా గురుకులాలు

కుంటుపడ్డ వైద్యం

గాడి తప్పిన విద్యా వ్యవస్థ

అయినను పోయి రావాలె హస్తినకు

మూసి పేరుతో - హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి - 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి

అయినను పోయి రావాలె హస్తినకు

పండగలు పండగళ్ళా లేవు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు తులం బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు

అయినను పోయి రావాలె హస్తినకు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఢిల్లీకి ఇన్నిసార్లు అవసరమా..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటించడం కోసం కూడా ఢిల్లీ, తెలంగాణ మధ్య మూడు నాలుగు ప్రయాణాలు జరిగాయి. అదే విధంగా సీఎం అభ్యర్థి కారు అయి.. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రతి విషయానికి ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ సహా రాష్ట్రంలో అమలు చేసే పథకాల గురించి చర్చించడానికి కూడా ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో ఒకటి రెండు రోజులు మంతనాలు చేస్తున్నారు. నిజానికి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉందా? ఒక్కడి నుంచి ఫోన్‌లోనో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో? వీటిపై చర్చించొచ్చు కదా. రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ ఖాళీ చేసిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ఢిల్లీ పర్యటనలకు అయ్యే ఖర్చు ఖజనానా నుంచి తీస్తున్నది కాదా? అని ప్రజల్లో చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. పలువురు విశ్లేషకులు కూడా ఇవే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story