కేటీయార్ మూడు అబద్ధాలు చెప్పారా ?
సింగరేణి గనులను వేలంవేయటంపై కేటీయార్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీయార్ మూడు అబద్ధాలు చెప్పినట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణాలో సింగరేణి గనుల ప్రైవేటు వ్యవహారం, వేలంపాటలే హాట్ టాపిక్కుగా మారిపోయింది. గనులను ప్రైవేటుపరం చేయటానికి మీరే కారణమంటే కాదు కాదు మీరే కారణమని బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ నేతలు ఒకరిపై మరొకళ్ళు బురదచల్లేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే సింగరేణి గనులను వేలంవేయటంపై కేటీయార్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీయార్ మూడు అబద్ధాలు చెప్పినట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి.
ఇంతకీ కేటీయార్ ఏమన్నారో చూద్దాం. మొదటి పాయింట్ ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం గనులను ప్రైవేటుపరం కానీకుండా అడ్డుకున్నారట. రెండోది వేలంపాటల్లో పాల్గొంటే గనులను వేలం వేయాలన్న కేంద్రప్రభుత్వం వాదనకు మద్దతిచ్చినట్లు అవుతుందనే సింగరేణిని వేలంపాటలకు అనుమతించలేదట. ఇక మూడో పాయింట్ ఏమిటంటే గనులను వేలంవేయాలన్న కేంద్రం ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందట. కేటీయార్ చెప్పిన మూడు పాయింట్లు నిజమే అని వాకాబు చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అవేమిటంటే కేటీయార్ చెప్పిన మూడు పాయింట్లు అబద్ధాలే అని. ఇపుడు కేటీయార్ చెబుతున్నదానికి తాము అధికారంలో ఉన్నపుడు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించారనే విషయం బయటపడింది.
అసలు సంగతి ఏమిటంటే మొదటి పాయింట్ ను తీసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు గనుల ప్రైవేటీకరణను అడ్డుకోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే కోయగూడెం, సత్తుపల్లి-3 బొగ్గు గనులను ప్రైవేటు సంస్ధ అరబిందో సొంతం చేసుకున్నది. సింగరేణి పరిధిలోని పై రెండు గనులకు కేంద్రప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తే అందులో అరబిందో కంపెనీ పాల్గొని సొంతం చేసుకుంది. ఈ విషయం కేటీయార్ కు బాగా తెలుసు. తెలిసి కూడా అబద్ధాలు చెప్పారు. వేలంపాటల్లో సింగరేణిని దూరంగా ఉంచినట్లు చెప్పారు. ఇది కూడా అబద్ధమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే సింగరేణి బొగ్గుగనుల వేలంపాటల్లో పాల్గొన్నది. ఒడిస్సాలోని నైని బొగ్గుగనిని సొంతం చేసుకున్నది. కేంద్రప్రభుత్వం నుండి అన్నీరకాల అనుమతులు మరో రెండు నెలల్లో రాబోతున్నాయి. వచ్చే సెప్టెంబర్ నెలలో నైని గనిలో సింగరేణి బొగ్గు తవ్వకాలకు అన్నీ ఏర్పాట్లను చేసుకుంటోంది.
ఒడిస్సాలోని మహానది కోల్ ఫీల్డ్ పరిధిలోని నైని బొగ్గుగని సింగరేణి సొంతమెట్లయ్యింది ? 2015, ఆగష్టు 15వ తేదీన జరిగిన వేలంపాటల్లో సింగరేణి కూడా పాల్గొని సొంతంచేసుకున్నది. సింగరేణి పరిధిలోని బొగ్గుగనుల వేలంపాటలకు సింగరేణిని దూరంగా ఉంచిన కేసీయార్ ప్రభుత్వం ఒడిస్సాలోని బొగ్గుగనుల వేలంపాటకు మాత్రం ఎందుకు అనుమతించింది ? దీన్నిబట్టి సింగరేణిని బొగ్గుగనుల వేలంపాటలకు దూరంగా ఉంచామని చెప్పటం అబద్ధమే అని తేలిపోతోంది. ఇక మూడో పాయింట్ గనుల వేలంపాట వేయాలన్న కేంద్రప్రభుత్వం ప్రయత్నాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందట. ఇది కూడా అబద్ధమే. ఎలాగంటే ఇందులో మళ్ళీ రెండు విషయాలున్నాయి. మొదటిదేమిటంటే 2022 ప్రాంతంలోనే భూపాలపల్లిలోని తాడిచెర్ల బొగ్గుగనిని కేసీయార్ ప్రభుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టిందట.
ఏఎంఆర్ అనే కంపెనీకి కేసీయార్ ప్రభుత్వం 30 ఏళ్ళు బొగ్గు గనిని లీజుకిచ్చిన విషయం ఇపుడు బయటపడింది. ఇదే పద్దతిలో సున్నపురాయి, ఐరన్ ఓర్ గనులను కూడా ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం జరిగింది. సూర్యాపేట జిల్లాలోని సైదులునామా, సుల్తాన్ పూర్ సున్నపు గనులను వేలం వేయటానికి అనుమతించాలని 2020, సెప్టెంబర్ 16వ తేదీన చీఫ్ సెక్రటరీ కేంద్రప్రభుత్వానికి రాసిన లేఖ బయటపడింది. రాష్ట్రప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం చెబుతు 2021 డిసెంబర్లో సున్నపురాయి గనులను వేలం వేయటానికి అనుమతిచ్చింది. సున్నపురాయి గనుల వేలంపాటకు అనుమతి అడుగుతు అప్పటి చీఫ్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు తాజాగా రేవంత్ రెడ్డి సమీక్షలో వివరించారని సమాచారం.
తాడిచెర్ల బొగ్గుగనిని ఏఎంఆర్ కంపెనీకి లీజుకివ్వటం, ఒడిస్సాలోని నైని బొగ్గుగని సింగరేణి సొంతమైన విషయాన్ని బొగ్గు, గనుల శాఖ ఉన్నతాధికారులు మంత్రి కిషన్ రెడ్డికి వివరించారట. అంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వం అధికార యంత్రాంగం సమాచారం ప్రకారం కేటీయార్ ఇపుడు చెబుతున్నది అబద్ధమే అని తేలిపోయింది. తాము అధికారంలో ఉన్నపుడు చేసిన పనులకు ఇపుడు పూర్తి విరుద్ధంగా కేటీయార్ మాట్లాడుతున్నారు.
ఇదే విషయమై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు తాడిచెర్ల బొగ్గుగనిని కేసీయార్ ప్రభుత్వం ఏఎంఆర్ కంపెనీకి లీజుకిచ్చింది వాస్తవమే అన్నారు. అలాగే సింగరేణి పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుగనుల వేలంపాటలో పాల్గొనని సింగరేణి ఎక్కడో దూరంగా ఉన్న ఒడిస్సాలోని నైని బొగ్గుగనుల వేలంపాటలో ఎందుకు పాల్గొన్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన పరిధిలో ఉన్న బొగ్గుగనుల వేలంపాటల్లో పాల్గొనేందుకు అనుమతించుంటే కోయగూడెం, సత్తుపల్లి-3 గనులు సింగరేణిక్కి దక్కి ఉండేవని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో ఉన్నపుడు చేసిన నిర్ణయాలకు ఇపుడు పూర్తిగా రివర్సులో కేటీయార్ మాట్లాడుతున్నారని మందా మండిపడ్డారు.