సైలెంటుగా కేటీఆర్ పనికానిచ్చేశాడా ?
x
KTR

సైలెంటుగా కేటీఆర్ పనికానిచ్చేశాడా ?

కేటీఆర్ ప్రకటనతో పార్టీనేతలతో పాటు కార్మికసంఘం నేతలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు


ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) చాలా సైలెంటుగా చెల్లెలు కవితను దెబ్బకొట్టారా ? ఇపుడిదే చర్చ పార్టీలో పెద్దఎత్తున జరుగుతోంది. ఇంతకీ కేటీఆర్(KTR) ఏమిచేశారంటే పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ప్రకటించారు. బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతు ఇక నుండి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్మికసంఘం వ్యవహారాలు నడవాలని సూచించారు. అందుకనే ఈశ్వర్ ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

కేటీఆర్ ప్రకటనతో పార్టీనేతలతో పాటు కార్మికసంఘం నేతలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటంటే ఇప్పటివరకు సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత(Kavitha) వ్యవహరిస్తున్నారు. కార్మిక సంఘం యాక్టివిటీస్ అంతా కవిత పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీబీజీకేఎస్ ను ఏర్పాటుచేసిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) కూతురు కవితను గౌరవ అధ్యక్షురాలిగా ప్రకటించారు. అంటే గడచిన పదేళ్ళుగా గౌరవాధ్యక్షురాలిగా కవితే వ్యవహరిస్తున్నారు. అలాంటిది కవితతో మాట మాత్రం కూడా చెప్పకుండానే గౌరవ అధ్యక్షురాలి పదవిలో కవితను తీసేసి ఈశ్వర్ ను ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.

బహుశా ఈవిషయన్ని కవిత ముందుగానే ఊహించినట్లున్నారు. అందుకనే బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూనే మరోవైపు సింగరేణి కార్మిక, ఉద్యోగులతో ‘సింగరేణి జాగృతి’ అనే సంస్ధను ఏర్పాటుచేశారు. బీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న కార్మికసంఘంలోని కొందరు సభ్యులను జాగృతిలోకి ఆకర్షిస్తున్నట్లుగా కవిత మీద కేసీఆర్(KCR), కేటీఆర్ కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దాంతో వెంటనే కేటీఆర్ రంగంలోకి దిగి గౌరవ అధ్యక్షుడిగా ఈశ్వర్ ను ప్రకటించారు. కేటీఆర్ ప్రకటన ద్వారా కవితకు బీఆర్ఎస్ అనుబంధ సంస్ధతో ఎలాంటి సంబంధంలేదని చెప్పకనే చెప్పినట్లయ్యింది. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే కవిత అన్నపై అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఇదేసమయంలో కేటీఆర్ మాత్రం బయటకు ఏమి మాట్లాడకుండానే చాలా సైలెంటుగా కవిత ప్లేసులో ఈశ్వర్ ను గౌరవ అధ్యక్షుడిగా నియమించటం కీలకమైన పరిణామమనే చెప్పాలి. తాజా పరిణామం కవితకు ఇస్తున్న సంకేతం ఏమిటంటే పార్టీనుండి పొమ్మనకుండా పొగబెట్టడమే. ఎందుకంటే కేసీఆర్ తెలియకుండానే గౌరవ అధ్యక్షుడి ఈశ్వర్ ను కేటీఆర్ ప్రకటించే అవకాశం లేదు కాబట్టే. తండ్రి, అన్నకు ఇష్టంలేకపోయిన తర్వాత కవిత ఇంకా ఎంతకాలం పార్టీలో ఉంటారో చూడాలి.

Read More
Next Story