
‘మోపుతున్న భారం వేలు.. తగ్గిస్తుంది రూపాయలు’
కేంద్రం జీఎస్‌టీ స్లాబు మార్పు నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. జీఎస్‌టీ తగ్గించామని ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను రూపంలో ప్రజల నుంచి రూ.వేలు దండుకుంటూ ఇప్పుడు పైసలు తగ్గించి ఏదో గొప్ప మేలు చేసినట్లు మాట్లాడుతున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. జీఎస్‌టీ స్లాబు రద్దు లేదా మార్పు అంటూ వారం రోజులుగా కేంద్రం దేశమంతా ప్రాపగండా సృష్టిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుందని కూతలు కూస్తోందని, అసలు వాళ్ల జీవితాలను అంధకారంలోకి నెట్టిందే ఈ కేంద్ర ప్రభుత్వమంటూ విమర్శలు గుప్పించారు. గత పుష్కరకాలంగా అనేక కబుర్లు చెప్పి ప్రజల జేబులుకు పన్నుల చిల్లు వేసి.. ఇప్పుడు ఏదో ధరలు తగ్గిస్తున్నట్లు ఢాంబికాలు పోతోందని చురకలంటించారు.
‘‘ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ రేట్ల రూపంలో ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వీటి రూపంలోనే ప్రతినెలా వేలాది రూపాయల భారం మోపుతున్నారు. ఇప్పుడు జీఎస్టీ స్టాబ్ మార్పు పేరుతో పదుల రూపాయల భారం తగ్గిస్తామని చెప్తున్నారు. పైగా దానికి భారీ ప్రచారం చేసుకుంటున్నారు. ధరలను తగ్గించాలన్న చిత్తశుద్దే ఉంటి.. ఆ వరుసలో ముందుగా ఉన్న పెట్రోల్ ధరలను తగ్గించండి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల రావాణా భారం తగ్గుంది. అది అన్ని వస్తువల ధరలు తగ్గడానికి దోహదం చేస్తాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై వేస్తున్న పన్ను భారం తగ్గించండి. సెస్సులను పూర్తిగా ఎత్తేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ చిత్తశుద్ధిని నిలుపుకోండి’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అసలు కేంద్రం చేప్తున్న జీఎస్టీ స్లాబ్ కథేంటి..?
జీఎస్‌టీలో కీలక మార్పులు తీసుకురావడానికి కేంద్రం రెడీ అయింది. ఇప్పటి వరకు 5, 8, 12, 28 శాతాలతో నాలుగు స్లాబులు ఉన్నాయి. కాగా ఇప్పుడు వీటిని రెండుగా మార్చాలని కేంద్రం యోచిస్తోంది. వీటిని కేవలం 5, 18 శాతం జీఎస్‌టీ స్లాబులుగా మార్చడానికి నిపుణులతో చర్చలు జరుపుతోంది. కాగా కొన్ని హానికారక వస్తువులపై మాత్రం 40శాతం జీఎస్‌టీ ఉంటుంది. జీఎస్‌టీ వసూళ్లు స్థిరత్వంలో పడటం వల్ల సాధారణ ప్రజానీకాన్ని పన్నుపోటు నుంచి తప్పించాలని భావించినట్టు కనబడుతున్నా, ఇంతకాలమూ ఈ పరిధిలో లేని మద్యం, ఇంధనం వంటివాటిని చేర్చబోతున్నారని నిపుణులు అంటున్నారు.
రాష్ట్రాల మంత్రులతో కేంద్రమంత్రి భేటీ
జీఎస్‌టీ సవరణ అంశంపై అన్ని రాష్ట్రాల అర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బుధవారం భేటీ కానున్నారు. ఇందులో పాల్గొని, తమ దృక్కోణాన్ని వెల్లడించడానికి తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సిద్ధమవుతున్నారు. అయితే ఈ భేటీలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీలను 5శాతం జీఎస్‌టీ కేటగిరిలో చేర్చాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. భట్టి కూడా ఇదే అంశాన్ని బలంగా వినిపించనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.