ఆపరేషన్ మల్కాజిగిరి.. సొంత గూటికి బీజేపీ నేత
x

ఆపరేషన్ మల్కాజిగిరి.. సొంత గూటికి బీజేపీ నేత

ఎన్నికలవేళ తెలంగాణలో ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగులు, మాజీలు కాంగ్రెస్ లో చేరగా.. బీజెపి నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.


పార్లమెంట్ ఎన్నికలవేళ తెలంగాణలో ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగులు, మాజీలు కాంగ్రెస్ లో చేరగా.. బీజెపి నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఏఐసిసి ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.

కూన 2009 నుండి 2021 వరకు కాంగ్రెస్ లో పని చేశారు. 2021 లో బీజేపీలో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మల్కాజిగిరి పార్లమెంటు టికెట్‌ను ఆశించారు. కానీ ఆ సీటు ఈటల రాజేందర్‌కు దక్కింది. దీంతో అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ నేతల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాగా, మల్కాజిగిరి ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో మరోసారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజిగిరి బరిలో ఉన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల కీలక నేతలను కాంగ్రెస్ తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలకు గేలం వేస్తోంది. స్వయంగా కాంగ్రెస్ నేతలు అసంతృప్తుల ఇళ్లకు వెళ్లి మరీ పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు పలుకుతున్నారు.

ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హనుమంత రెడ్డి, భూపతిరెడ్డి.. కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన శ్రీశైలం గౌడ్.. నేడు సొంత గూటికి తిరిగి చేరుకున్నారు.

Read More
Next Story