లేక్ సిటీ హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణలో హైడ్రా ముందడుగు
x
హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ముందడుగు

లేక్ సిటీ హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణలో హైడ్రా ముందడుగు

బెంగళూరు ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తితో హైదరాబాద్‌లో చెరువు సంరక్షణ విప్లవం...


హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణకు దశలవారీగా హైడ్రా ముందడుగు వేసింది. నగర మనుగడ కోసం చెరువుల ఆక్రమణలు, కాలుష్యం, నీటి నిల్వ తగ్గుముఖం వంటి సవాళ్లను ఎదుర్కొని, నగరాన్ని మళ్లీ ‘లేక్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు హైడ్రా ముందుకు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 185 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో రూ.58 కోట్లతో ఆరు చెరువుల సుందరీకరణను మొదటి దశగా ఈ ఏడాది డిసెంబర్ 9నాటికి పూర్తి చేయాలని హైడ్రా నిర్ణయించింది.


బెంగళూరు లేక్ మ్యాన్ ఆనంద్ మల్లిగావడ్ స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు, కాలుష్యం బారి నుంచి చెరువులను రక్షించి వాటిని సుందరీకరణ చేసేందుకు హైడ్రా పనులు చేపట్టింది. నగరంలో 185 చెరువులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఉన్న హైడ్రా మొదటి దశలో ఆరు చెరువుల సుందరీకరణ పనులను ఈ ఏడాది డిసెంబరు 9వతేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది.

రూ.58 కోట్లతో చెరువుల సుందరీకరణ
హైదరాబాద్ నగరంలో మొదటి దశలో భాగంగా రూ.58 కోట్లతో ఆరు చెరువులను పునరుద్ధరించి, సుందరీకరించాలని హైడ్రా నిర్ణయించింది.బతుకమ్మ కుంట సుందరీకరణ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. సున్నం చెరువు, ఉప్పల్ పెద్ద చెరువు, కూకట్ పల్లి నల్ల చెరువు, తుమ్మిడికుంట,అప్పాచెరువు, బాచుపల్లి ఎర్రకుంట, బంబుక్ దౌలా చెరువుల పునురుద్ధరణ పనులను డిసెంబరు 9వతేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైడ్రా చెరువు శిఖం భూముల్లో ఆక్రమణలను తొలగించి పునరుద్ధరణ పనులు చేపట్టగా కొందరు నివాసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో చెరువుల సుందరీకరణ పనుల్లో జాప్యం జరుగుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

సీఎస్ఆర్ నిధులతో చెరువుల సుందరీకరణ
హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో 185 చెరువులను పునరుద్ధరించి సుందరీకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ, గ్రేటటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో చర్చించి రెండవ విడత చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. 185 చెరువుల పరిరక్షణకు వాటి వద్ద సోలార్ పవర్ తో సీసీటీవీ మానిటరింగ్ కెమెరాలను ఏర్పాటు చేశామని కమిషనర్ చెప్పారు. లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ పూర్వ వైభవాన్ని చాటిచెప్పేలా చెరువులను సుందరీకరిస్తామని ఆయన తెలిపారు.

కబ్జాలపై హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదులు
నగరంలో క‌బ్జాలు జ‌రుగుతుంటే న‌గ‌ర ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోవ‌డం లేదు. నేరుగా హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. ర‌హ‌దారి బంద్ అయితే ఫొటోలు తీసి మ‌రీ చూపిస్తున్నారు. చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతుంటే వీడియోలు పెడుతున్నారు. ఎవ‌రెవ‌రికి ఫిర్యాదు చేశారో కూడా చెప్పి సాక్ష్యాల‌ను చూపిస్తున్నారు. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులందాయి. బాలాన‌గ‌ర్ మండ‌లం కూక‌ట్‌ప‌ల్లిలోని హ‌స్మ‌త్‌పేట విలేజ్‌లో ప్ర‌భుత్వానికి చెందాల్సిన 10 ఎక‌రాలు క‌బ్జా చేసేస్తున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందింది. తూములు మూసేసి, అలుగులు ఎత్తు పెంచ‌డంతో చెరువు పై భాగంలో ఉన్న భూములు, లే ఔట్‌లు నీట మున‌గుతున్నాయ‌ని కొంత‌మంది, చెరువుల్లో మ‌ట్టి పోసి ఎక‌రాల‌కొద్దీ క‌బ్జా చేస్తున్నారంటూ మ‌రికొంత‌మంది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్పారు.

సోమవారం చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనరుకు ఫిర్యాదు చేస్తున్న హైదరాబాద్ నగర ప్రజలు


ఎన్నెన్నో చెరువుల ఆక్రమణలు...

- శంషాబాద్ మండ‌లంలోని పెద్ద‌గోల్కొండ గ్రామం ప‌రిధిలోని స‌ర‌సింహ‌కుంట తూములు మూసేసి.. అలుగు ఎత్తు పెంచ‌డం వ‌ల్ల ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి త‌మ పంట పొలాలు మునిగిపోయాయ‌ని ఆ గ్రామ ప్ర‌జ‌లు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.చెరువు స్థాయికి మించి నిండ‌డంతో ఆ నీరు ఔట‌ర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 15 వ‌ద్ద స‌ర్వీసు రోడ్డును ముంచెత్తుతోంద‌ని.. దీంతో రాక‌పోక‌ల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, మండ‌లంలోని బీరంగూడ‌లో ఉన్న శాంబుని కుంట క‌బ్జాల‌కు గురి అవుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. స‌ర్వే నంబ‌రు 756లో ఉన్న ఈ చెరువు వాస్త‌వ విస్తీర్ణం 22.11 ఎక‌రాలు కాగా.. ప్ర‌స్తుత‌తం ఆరేడు ఎకరాల‌కు ప‌రిమిత‌మైంద‌ని వాపోయారు. చెరువులో మ‌ట్టిపోసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని హైడ్రా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఆ చెరువు క‌నుమ‌రుగవుతుంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతంలో ప‌రికి చెరువులో 12 ఎక‌రాల మేర రాత్రికి రాత్రి మ‌ట్టిపోసి నింపుతున్నార‌ని.. నంబ‌రు ప్లేటు లేని వాహ‌నాల‌ను వినియోగిస్తున్నార‌ని అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు.18 అంత‌స్తుల అపార్టుమెంట్ ను నిర్మించి అమ్మేసేందుకు సిద్ధం అవుతున్నార‌ని.. వెంట‌నే హైడ్రా ఆపాల‌ని కోరారు.
- అమీన్‌పూర్ పెద్ద చెరువులోకూడా మ‌ట్టిపోసి.. భ‌వ‌న నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని.. అడ్డుకున్న త‌మపై దాడి చేయ‌డ‌మే కాకుండా.. స్థానిక పోలీసు స్టేష‌న్లో కేసులు పెట్టి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు.
- మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం, హస్మత్‌పేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణల‌పై ఓల్డ్ బోయిన్‌పల్లి నివాసులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 1లోని 28.28 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.



హైదరాబాద్ లేక్ సిటీ అయ్యేనా?

హైదరాబాద్ నగర చెరువులు ఒకప్పుడు ఈ నగరానికి జీవనాడిగా నిలిచాయి. అయితే, కాలక్రమంలో జరిగిన నిర్లక్ష్యం, ఆక్రమణలు, కాలుష్యం వాటి అస్తిత్వాన్నే ప్రమాదంలోకి నెట్టాయి. ఇప్పుడు హైడ్రా చేపట్టిన ఈ పునరుద్ధరణ చర్యలు ఆ పాత వైభవాన్ని తిరిగి తెచ్చే దిశగా ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం, సంస్థల సీఎస్ఆర్ నిధులు, అధికారుల కట్టుదిట్టమైన పర్యవేక్షణ ...ఇవన్నీ కలిస్తేనే ఈ చెరువుల సుందరీకరణ యజ్ఞం విజయవంతమవుతుంది. చెరువులు మళ్లీ సజీవమై, హైదరాబాదుకు ‘లేక్ సిటీ’ అనే బిరుదు మళ్లీ సార్థకం అవుతుందన్న ఆశతో నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు.


Read More
Next Story