Revanth|నిన్న భూసేకరణ రద్దు..వెంటనే నోటిపికేషన్
శుక్రవారం భూసేకరణ నోటిఫికేషన్ను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ శనివారం భూసేకరణకు మరో నోటిఫికేషన్ జారీచేసింది.
కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లుంది. అందుకనే శుక్రవారం భూసేకరణ నోటిఫికేషన్ను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ శనివారం భూసేకరణకు మరో నోటిఫికేషన్ జారీచేసింది. ఫార్మా కంపెనీల కోసం చేయాలని అనుకున్న భూసేకరణను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ పేరుతో శనివారం ఉదయం మళ్ళీ మరో నోటిఫికేషన్ జారీచేసింది. ఇంతకుముందు చేయాలని అనుకున్న భూసేకరణ ఫార్మా కంపెనీల స్ధాపనకోసమైతే ఇపుడు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. అంటే ఏదో పద్దతిలో రైతుల నుండి భూములను సేకరించటమే ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.
విచిత్రం ఏమిటంటే ప్రజల అంగీకారంతోనే భూసేకరణ చేయబోతున్నట్లు రేవంత్ ప్రభుత్వం(Revanth government) నోటిఫికేషన్లో చెప్పటం. ఏ రైతు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించటానికి ఇష్టపడరని అందరికీ తెలిసిందే. భూసేకరణ అంటేనే రైతుల నుండి బలవంతంగా భూములను సేకరించటం. మళ్ళీ ఇందులో ప్రజల అంగీకారంతోనే భూములను తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటం కేవలం కంటితుడుపు ప్రకటన మాత్రమే. నియోజకవర్గంలో దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో భూములు సేకరించబోతున్నట్లు నోటిఫికేషన్లో ఉంది. లగచర్ల(Lagacharla)లో 110 ఎకరాలు, పోలేపల్లిలో 72 ఎకరాల సేకరణ కోసం నోటిఫికేషన్ జారీఅయ్యింది. ఆసక్తిగా ఉన్న రైతుల నుండే భూములను ప్రభుత్వం సేకరించబోతోంది. అవసరమైన భూములు రాకపోతే మిగిలిన వాళ్ళతో తర్వాత ప్రభుత్వం మాట్లాడుతుందేమో చూడాలి. బలవంతంగా ఎవరి దగ్గర నుండి భూములు లాక్కునే ఉద్దేశ్యం లేదని ప్రభుత్వం ప్రకటించినా దాన్ని రైతులు ఎవరూ నమ్మటంలేదు.
ఫార్మాయూనిట్ల కోసం ప్రకటించిన భూసేకరణలో ఎంత రచ్చ రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. లగచర్లలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీద రైతులు, గ్రామస్తులు దాడిచేయటం తెలంగాణా మొత్తంలో సంచలనంగా మారింది. ఆ తర్వాత జరిగిన ఘటనలు అందరికీ తెలిసిందే. లగచర్ల వివాదం ముగియకుండానే నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్(Dilawarpur village) గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) నిర్మాణ వివాదం మరింత సంచలనంగా మారింది. వివాదం మరింత రాజుకోకముందే ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులను రద్దుచేసుకునే ఆలోచనలో ఉందని కలెక్టర్ ప్రకటనతో గ్రామస్తులు, రైతులు తాత్కాలికంగా శాంతించారు. కాబట్టి ఎక్కడైనా రైతులు తమ భూములను ఏ కారణంతో కూడా ప్రభుత్వానికి ఇవ్వటానికి అంగీకరించరు. అందుకనే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసి భూములను తీసుకునేది. ప్రజాప్రయోజనాల కోసం అంటే ఎవరు కూడా తమ భూములను ఇవ్వను అని ప్రభుత్వానికి చెప్పేందుకులేదు. మరి తాజాగా జారీచేసిన మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్(Land Acquisition) ఏమవుతుందో చూడాలి.