
కంచె గచ్చిబౌలిలోవి అటవీ భూములే: కేటీఆర్
సీఎం రేవంత్‌కు బీజేపీ నేత ఒకరు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఓ బ్రోకరేజ్ సంస్థతో సంప్రదింపులు జరిపారని చెప్పారు
తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందులో అయినా ఒకే మంత్రం పాటిస్తోందని, అదే 3డీ మంత్ర అంటూ చురకలంటించారు. 3డీ అంటే డిసీవ్, డిస్ట్రక్షన్, డైవర్షన్ అని కేటీఆర్ విశదీకరించారు. తెలంగాణ భవన్ పెట్టిన సమావేశం సందర్భంగా కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ సృష్టిస్తున్న విధ్వంసానికి కంచె గచ్చిబౌలి భూములు నిదర్శనమన్నారు. ఆ 400 ఎకరాల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వంసం చూసి యావత్ దేశం విస్తుబోయిందని అన్నారు. అనంతరం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి అటవీ భూమేనని చెప్పారు. తాను ఈ మాట సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగానే చెప్తున్నానని వివరించారు.
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరం చేస్తోందని, రూ.10వేల కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌కు బీజేపీ నేత ఒకరు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఓ బ్రోకరేజ్ సంస్థతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. ఎఫ్ఆర్‌బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ చెప్పిందని పేర్కొన్నారు కేటీార్. దీని కోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్‌బీఐ నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు కేటీఆర్.
"తనకు అండగా నిలబడిన బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు. కుంభకోణానికి సహకరించిన ఎంపీ పేరు వచ్చే ఎపిసోడ్లో బయటపెడతా. నిర్దిష్టమైన ఆధారాలతో కేంద్రానికి లేఖలు రాస్తాను. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఇదంతా జరిగిందని అనుకుంటున్నా. రేవంత్రెడ్డి తెరతీసింది కేవలం ఈ 400 ఎకరాలకు మాత్రమే కాదు.. రూ.60వేల కోట్ల విలువైన హెచ్ఎండీఏ భూముల ద్వారా దోపిడీకి స్కెచ్ వేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలి” అని కోరారు.